ఉప్పల్ భగాయత్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ, ఆర్యవైశ్యుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఆర్యవైశ్యులు సౌమ్యులు, ఆత్మాభిమానం కలిగిన వారని కొనియాడిన ఆయన, పేదరికంలో ఉన్నప్పటికీ వారు ఆత్మగౌరవం కోసం రాజీ పడరని పేర్కొన్నారు. ఆర్యవైశ్యులు కలిసికట్టుగా ఉంటేనే రాజకీయాల్లో తమ వాటాను సాధించుకోగలరని ఆయన సూచించారు.

ఈ సందర్భంగా దివంగత మాజీ ముఖ్యమంత్రి రోశయ్యను సీఎం రేవంత్ స్మరించుకున్నారు. రోశయ్య దూరదృష్టి వల్లే 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం రూ.16 వేల కోట్ల మిగులు బడ్జెట్‌తో ఏర్పడిందని ఆయన గుర్తు చేశారు. చెన్నారెడ్డి, విజయభాస్కర్ రెడ్డి, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వంటి మాజీ ముఖ్యమంత్రులు సైతం ఆర్థిక నిర్వహణ బాధ్యతలను ఆర్యవైశ్యులకే అప్పగించేవారని ఆయన తెలిపారు.

రాజకీయాల్లో తాను రాణిస్తానని రోశయ్య ముందే గుర్తించి ఆశీర్వదించారని సీఎం రేవంత్ వెల్లడించారు. శాసనమండలిలో తాను ఆవేశంగా మాట్లాడినప్పుడు, అనుభవంతో ముందుకు వెళ్లాలని ఆయన సూచించేవారని చెప్పారు. రాష్ట్రం విడిపోయినా రోశయ్య గౌరవాన్ని కాపాడాలనే ఉద్దేశంతోనే హైదరాబాద్ నడిబొడ్డున ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు.

ప్రపంచస్థాయి నాయకుడైన మహాత్మా గాంధీ ఆర్యవైశ్యుడేనని, ఆయన కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు కావడం గర్వకారణమని సీఎం రేవంత్ పేర్కొన్నారు. ఆర్యవైశ్యులకు రావాల్సిన గుర్తింపు ఇంకా రాలేదని అభిప్రాయపడిన ఆయన, తమ ప్రభుత్వం వారి పట్ల సంపూర్ణ విశ్వాసంతో ఉందని చెప్పారు. ఇప్పటికే ఆర్యవైశ్యులకు ఒక కార్పొరేషన్ పదవి, కొడంగల్‌లో ఒక మున్సిపాలిటీ చైర్మన్ పదవి ఇచ్చామని గుర్తు చేశారు.

ఆర్యవైశ్యుల డిఎన్‌ఎలోనే ముందుచూపు, పొదుపు అలవాట్లు ఉన్నాయని సీఎం రేవంత్ ప్రశంసించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆపదలో ఉన్నవారికి అప్పు ఇచ్చి ఆదుకునేవారు ఆర్యవైశ్యులేనని ఆయన వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో మంత్రి వివేక్ వెంకటస్వామి, మాజీ మంత్రి టిజి వెంకటేష్, ఎఐపిసి చైర్మన్ మధుయాష్కీ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.