వినాయక చవితి పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నాలను తొలగించి, చేసే పనుల్లో విజయాన్ని ఇచ్చే దైవంగా హిందూ సమాజం వినాయకుడిని భక్తితో కొలుస్తుందని ఆయన చెప్పారు.
భారతీయ సనాతన సంప్రదాయంలో ఏ శుభకార్యం లేదా దైవపూజ మొదలుపెట్టినా, ముందుగా విఘ్నేశ్వరుడిని ఆరాధించడం మన సంస్కృతి అని ఆయన గుర్తుచేశారు. అందుకే హిందూ ఆచారాల్లో గణనాథుడికి అగ్రతాంబూలం, తొలి ప్రాధాన్యత దక్కుతాయని ఆయన వివరించారు.
రాష్ట్రవ్యాప్తంగా పల్లెలు, పట్టణాల్లో వాడవాడలా గణపతి మండపాలను ఏర్పాటు చేస్తారని కేసీఆర్ పేర్కొన్నారు. చిన్నారులు, పెద్దలు కలిసి తొమ్మిది రోజుల పాటు నవరాత్రుల ఉత్సవాలను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారని ఆయన తెలిపారు.
ఈ పవిత్ర సమయంలో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజల జీవితాల్లో ఆనందం వెల్లివిరియాలని ఆయన ఆకాంక్షించారు. ముఖ్యంగా వ్యవసాయ రంగం మళ్లీ గాడిన పడాలని ఆయన కోరుకున్నారు.
సమృద్ధిగా వర్షాలు కురిసి, పాడిపంటలతో తెలంగాణ రైతు కుటుంబాలు సుఖసంతోషాలు, సిరిసంపదలతో వర్ధిల్లాలని ఆ ఏకదంతుడిని మనసారా ప్రార్థిస్తున్నట్లు ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో కేసీఆర్ పేర్కొన్నారు.








