తమిళనాడులోని ఆలయాల్లో వీఐపీ దర్శనాలు, మొబైల్ ఫోన్ల వినియోగంపై ఎండోమెంట్ శాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై వీఐపీ దర్శనం కోరుకునే వారు కనీసం ఒకరోజు ముందుగానే ఆలయ అధికారులకు సమాచారం అందించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనివల్ల సాధారణ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు తగిన ఏర్పాట్లు చేసే అవకాశం ఉంటుంది.
ఆలయాల లోపల వీఐపీలతో పాటు భద్రతా సిబ్బంది, విధులు నిర్వహించే అధికారులు మాత్రమే ఉండాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. వీఐపీల కదలికలు సాధారణ భక్తుల దర్శనానికి ఆటంకం కలిగించకూడదని ప్రభుత్వం హెచ్చరించింది. ఈ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని ఆలయ అధికారులకు సూచించింది.
మరోవైపు, ఆలయ ప్రాంగణంలో మొబైల్ ఫోన్ల వాడకాన్ని పూర్తిగా నిషేధించాలని ఎండోమెంట్ శాఖ ఆదేశించింది. ఆలయాల లోపల ఫోటోలు తీయడం, వీడియోలు రికార్డ్ చేయడం, సెల్ఫీలు తీసుకోవడం, రీల్స్ చేయడం వంటి పనులు ఆధ్యాత్మిక వాతావరణానికి, ఆలయ పవిత్రతకు భంగం కలిగిస్తున్నాయని ప్రభుత్వం పేర్కొంది.
ఈ నిబంధనల అమలులో భాగంగా, ఆలయ ప్రాంగణంలో మొబైల్ ఫోన్ల వాడకం నిషేధించబడిందనే విషయాన్ని భక్తులకు తెలియజేస్తూ బోర్డులను ఏర్పాటు చేయాలని ఆలయాలను ఆదేశించారు. భక్తులు ఈ నిబంధనలను పాటించేలా చూడాలని సంబంధిత శాఖ స్పష్టం చేసింది.








