సూర్యాపేట జిల్లా మోతె మండలం బిక్యా తండాకు చెందిన హలావత్ నాగులు, బూబా మంగళవారం రాత్రి అదృశ్యమయ్యారు. బుధవారం ఉదయం రోడ్డు పక్కన ఉన్న గుంతలో మహిళ కాలు బయటకు కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు, దంపతులిద్దరి మృతదేహాలను వేర్వేరు గుంతల్లో పూడ్చిపెట్టినట్లు గుర్తించారు.
పోలీసుల విచారణలో మోతె పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్ షరీఫ్ ఈ హత్యలకు పాల్పడినట్లు తేలింది. షరీఫ్ మరో వ్యక్తి సహాయంతో దంపతులను గుంతలు తీయాలని పిలిపించి, తల వెనక భాగంలో బలంగా కొట్టి చంపినట్లు పోలీసులు నిర్ధారించారు. మంగళవారం రాత్రి పదిన్నర గంటల సమయంలో దంపతులు ఆవులను పొలానికి తీసుకెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.
హత్యకు వివాహేతర సంబంధం, మూడు లక్షల రూపాయల ఆర్థిక లావాదేవీలే కారణమని ప్రాథమిక విచారణలో వెల్లడైంది. షరీఫ్‌కు పెళ్లి కుదరడంతో, డబ్బు కోసం దంపతులు ఒత్తిడి తేవడం వల్లే వారిని చంపాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ కేసులో కానిస్టేబుల్‌తో పాటు సహకరించిన మరో వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ప్రస్తుతం నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు, హత్యకు దారితీసిన పరిస్థితులపై లోతుగా విచారణ చేస్తున్నారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ ద్వారా ఘటనా స్థలంలో ఆధారాలను సేకరిస్తున్నారు.







