అస్సామీ నటి కయాదు లోహర్ ప్రస్తుతం అరడజను భారీ చిత్రాల్లో నటిస్తూ కెరీర్‌లో దూసుకుపోతున్నారు. ఇప్పటివరకు పెద్ద బ్లాక్‌బస్టర్ హిట్లు లేకపోయినా, తన స్క్రీన్‌ప్రజెన్స్ మరియు నటనతో యువతలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ క్రమంలోనే ఆమెకు తమిళ చిత్ర పరిశ్రమలో మరో పెద్ద అవకాశం దక్కింది.
‘జై భీమ్’ ఫేమ్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో వస్తున్న సూర్య 48వ సినిమాలో కయాదు లోహర్ కీలక పాత్ర పోషించనున్నారు. ఈ చిత్రం పేదల వైద్యుడిగా పేరుగాంచిన చెన్నై డాక్టర్ కృష్ణ వరదాచారి తిరువేంగడం జీవితం ఆధారంగా రూపొందుతోంది. రోగుల నుంచి కేవలం ఐదు రూపాయల ఫీజు మాత్రమే తీసుకుంటూ ‘ఐదు రూపాయల డాక్టర్’గా ఆయన ప్రజల మన్ననలు పొందారు.
ఈ సినిమాలో కయాదు లోహర్ ఒక టీచర్ పాత్రలో కనిపించనున్నారు. కథా గమనంలో ఆమె పోషించే ఈ పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంటుందని సమాచారం. ఈ సినిమాకు సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది.






