స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో తమ పార్టీ అభ్యర్థులను ప్రభుత్వం అడ్డుకుంటోందని మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు ఆరోపించారు. నామినేషన్ దాఖలు చేసేటప్పుడు అవసరమైన సర్టిఫికెట్లు సమర్పించకపోతే ఆ నామినేషన్లు తిరస్కరణకు గురవుతాయని, ఇదే అవకాశంగా తీసుకుని అధికారులు తమ అభ్యర్థులకు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని ఆయన పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ ఆదేశాల మేరకే అధికారులు ఇలా వ్యవహరిస్తున్నారని అంబటి రాంబాబు విమర్శించారు. తహసీల్దార్లకు నేరుగా ఫోన్ చేసి సర్టిఫికెట్లు జారీ చేయవద్దని ప్రభుత్వం ఆదేశించే స్థాయికి దిగజారిందని ఆయన ఆరోపించారు. ఈ సమస్యపై కలెక్టర్‌ను కలిసి ఫిర్యాదు చేశామని, తగిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారని ఆయన తెలిపారు.

ఒకవేళ సర్టిఫికెట్లు ఇవ్వకుండా నామినేషన్లను తిరస్కరిస్తే, తాము ప్రజా ఉద్యమం చేపడతామని అంబటి హెచ్చరించారు. ప్రస్తుతం ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందని, ఎన్నికలు నిజాయితీగా జరిగితే వైసీపీ విజయం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ఇదే సమయంలో తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయ భవనం కూల్చివేత అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. తమ ప్రభుత్వ హయాంలో రెండు ఎకరాల భూమిని కార్యాలయ నిర్మాణానికి కేటాయించామని, భవనం పూర్తయ్యే దశలో ఉండగా ప్రస్తుత ప్రభుత్వం కూల్చివేసిందని అంబటి ఆరోపించారు. కోర్టు నోటీసులు ఇవ్వాలని చెప్పినా అధికారులు పట్టించుకోలేదని ఆయన విమర్శించారు.

ప్రస్తుతం ఆ స్థలాన్ని స్మశాన వాటిక కోసం వెనక్కి తీసుకుంటామని తహసీల్దార్ నోటీసు ఇచ్చారని ఆయన తెలిపారు. చంద్రబాబు ఇంటికి అనుమతులు లేకపోయినా, ఆయన కోర్టును ఆశ్రయించి కూల్చివేతను అడ్డుకున్నారని అంబటి గుర్తు చేశారు. వైసీపీ కార్యాలయ భూమి, సర్టిఫికెట్ల జారీ అంశాలపై ప్రజలు తిరుగుబాటుకు సిద్ధంగా ఉన్నారని ఆయన హెచ్చరించారు.