ఎస్‌కే గ్రూప్ చైర్మన్ చే టే-వోన్ (Chey Tae-won) తన మాజీ భార్య రో సో-యాంగ్ (Roh So-yeong)కు 944 బిలియన్ వోన్, అంటే భారత కరెన్సీలో సుమారు రూ. 5,500 కోట్లు నగదు రూపంలో చెల్లించాలని సియోల్ హైకోర్టు ఆదేశించింది. దక్షిణ కొరియాలో 'శతాబ్దపు విడాకుల కేసు'గా పిలుస్తున్న ఈ వివాదంలో కోర్టు ఈ సంచలన తీర్పును వెలువరించింది.
1988లో వివాహం చేసుకున్న వీరిద్దరి మధ్య 2015లో చే టే-వోన్ తనకు మరో మహిళతో సంబంధం ఉందని, వారికి సంతానం కూడా ఉందని బహిరంగంగా ప్రకటించడంతో విడాకుల ప్రక్రియ మొదలైంది. గతంలో కోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు పునఃపరిశీలన కోరడంతో, హైకోర్టు తాజాగా ఈ భారీ మొత్తాన్ని ఖరారు చేసింది.
కుటుంబ నిర్వహణతో పాటు వ్యాపార, సామాజిక కార్యక్రమాల్లో రో సో-యాంగ్ అందించిన సహకారం ఎస్‌కే గ్రూప్ ఆస్తుల పెరుగుదలకు పరోక్షంగా దోహదపడిందని కోర్టు అభిప్రాయపడింది. అయితే, ఆమె తండ్రి, మాజీ అధ్యక్షుడు రో టే-వూ నుంచి వచ్చిన నిధులు సంస్థ ఎదుగుదలకు కారణమయ్యాయన్న వాదనను మాత్రం కోర్టు తిరస్కరించింది.
ఈ తీర్పుపై చే టే-వోన్ మళ్లీ దక్షిణ కొరియా సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉందని సమాచారం. దీంతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన ఈ విడాకుల కేసు విచారణ ఇంకా కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి.








