చైనా మాస్టర్స్ టోర్నీలో భారత షట్లర్ లక్ష్య సేన్ తీవ్రంగా నిరాశపరిచాడు. ప్రపంచ ర్యాంకింగ్‌లో తొమ్మిదో స్థానంలో ఉన్న కెనడాకు చెందిన విక్టర్ లాయ్ చేతిలో లక్ష్య సేన్ ఓడిపోయి టోర్నీ నుంచి బయటకు వచ్చేశాడు.

బుధవారం పెన్‎జెన్ వేదికగా జరిగిన ఈ పోరు కేవలం 38 నిమిషాల్లోనే ముగిసింది. విక్టర్ లాయ్ 14-21, 7-21 తేడాతో లక్ష్య సేన్‌ను ఓడించి తదుపరి రౌండ్‌కు చేరుకున్నాడు.

మ్యాచ్ ఆరంభంలో లక్ష్య సేన్ 4-0 ఆధిక్యంతో మంచి జోరు చూపించాడు. అయితే ఆ తర్వాత విక్టర్ లాయ్ తన వ్యూహాత్మక డిఫెన్స్‌తో భారత ఆటగాడిని ఒత్తిడిలోకి నెట్టాడు. దీంతో లక్ష్య సేన్ ర్యాలీలను ఎదుర్కోవడంలో ఇబ్బంది పడుతూ రిస్క్ తీసుకోవడం మొదలుపెట్టాడు.

ముఖ్యంగా బ్యాక్‌హ్యాండ్ సైడ్‌లైన్ వైపు షాట్లు కొట్టడంలో లక్ష్య సేన్ పదేపదే పొరపాట్లు చేశాడు. ఈ అవకాశాన్ని లాయ్ తనకు అనుకూలంగా మార్చుకుని తొలి గేమ్‌ను 21-14తో గెలుచుకున్నాడు.

రెండో గేమ్‌లో లక్ష్య సేన్ కోలుకునే అవకాశం లేకుండా పోయింది. విక్టర్ లాయ్ బలమైన అటాకింగ్, డిఫెన్స్‌తో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించాడు.

4-11తో వెనకబడిన లక్ష్య సేన్ పాయింట్ల అంతరాన్ని తగ్గించేందుకు ప్రయత్నించినా, మరిన్ని అనవసర తప్పిదాలు చేశాడు. ఫలితంగా రెండో గేమ్‌ను 21-7తో కోల్పోయి టోర్నీ నుంచి నిష్క్రమించాడు.