రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గీతానగర్ ప్రభుత్వ పాఠశాలలో సరికొత్త విద్యా విప్లవం మొదలైంది. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన విద్యను అందించేందుకు ఇక్కడ ఒక హ్యూమనాయిడ్ రోబో టీచర్‌ను అందుబాటులోకి తెచ్చారు. బెంగళూరుకు చెందిన ఇండస్ సంస్థ భాగస్వామ్యంతో ఈ అధునాతన AI ప్రాజెక్టును పాఠశాలలో ప్రారంభించారు.
ఈ రోబో ద్వారా పాఠ్యాంశాలను విజువల్స్ రూపంలో, ఆసక్తికరంగా బోధించనున్నారు. కృత్రిమ మేధ (AI) సాయంతో కష్టమైన అంశాలను కూడా విద్యార్థులు సులభంగా అర్థం చేసుకుంటారని ఇండస్ కంపెనీ డైరెక్టర్ విఘ్నేష్ రావు, హెచ్‌వైడీ కమ్యూనిటీ ప్రాజెక్టు ప్రతినిధి శామ్యూల్ జోసెఫ్ తెలిపారు. ఈ విధానం వల్ల విద్యార్థుల్లో సైన్స్, టెక్నాలజీ పట్ల ఆసక్తి పెరుగుతుందని ఉపాధ్యాయులు అభిప్రాయపడ్డారు.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రముఖ నేత కొండూరి రవీందర్ రావు, మున్సిపల్ ఛైర్మన్ జిందం కళా చక్రపాణి పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ విప్లవానికి ఇది నాంది అని వారు పేర్కొన్నారు. భవిష్యత్తులో మరిన్ని సర్కారీ బడుల్లో ఈ సాంకేతికతను విస్తరిస్తే పేద విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుందని అధికారులు ఆకాంక్షించారు.








