వయోవృద్ధుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో 2006 నుంచి సీనియర్ సిటిజన్లకు గుర్తింపు కార్డులను అందజేస్తున్నారు. రైల్వే, విమాన ప్రయాణాల్లో రాయితీలు, ఆర్టీసీ బస్సుల్లో సీట్ల కేటాయింపు, కోర్టుల్లో ప్రాధాన్యత, దేవాలయాల్లో దర్శన సౌకర్యాల కోసం ఈ కార్డులు ఉపయోగపడతాయి. అయితే, 2023 వరకు కొనసాగిన ఈ ప్రక్రియను ప్రభుత్వం ఏడాది కాలంగా పూర్తిగా నిలిపివేసింది.

కరీంనగర్ జిల్లాలో సుమారు 15 వేల మంది రిటైర్ అయిన ఉద్యోగులు, 51,084 మంది వృద్ధాప్య పెన్షన్ పొందుతున్న వారు కార్డుల కోసం ఎదురుచూస్తున్నారు. దరఖాస్తులు స్వీకరిస్తున్నప్పటికీ, కార్డులు ఎప్పుడు ఇస్తారో అధికారులు స్పష్టంగా చెప్పడం లేదని వృద్ధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో దరఖాస్తుదారులు కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోంది.

ప్రభుత్వ ఆదేశాల మేరకే కార్డుల జారీని నిలిపివేసినట్లు అధికారులు చెబుతున్నారు. కార్డుల కోసం దరఖాస్తులు పెరగడంతో, ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలపగా నిలిపివేయాలని సూచించారని వారు పేర్కొన్నారు. వృద్ధాప్య పెన్షన్ల మంజూరులో స్పౌజ్ కేటగిరీకి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వడం, ఇతర ప్రయోజనాలు పెండింగ్‌లో ఉండటంతో వృద్ధులు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

జీవిత చరమాంకంలో ఉన్న వృద్ధులు తమ సమస్యల పరిష్కారం కోసం వీధుల్లోకి వచ్చి పోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని వారు ఆవేదన చెందుతున్నారు. కార్డుల జారీని పునరుద్ధరించే అంశంపై ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పష్టత లేకపోవడంతో, దరఖాస్తుదారులు నిరాశలో ఉన్నారు.