హీరో యశ్ నటించిన తాజా యాక్షన్ చిత్రం 'Toxic'. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కియారా అద్వానీ కథానాయికగా నటించారు. వెంకట్ కె.నారాయణ, యష్ కలిసి మాన్ స్టర్ మైండ్ క్రియేషన్స్, కేవీఎన్ ప్రోడక్షన్స్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. ఆగస్టు 26న సినిమాను విడుదల చేయడానికి మేకర్స్ సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో యశ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా యశ్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. సినిమాలను ఎవరూ ఎక్కువగా సీరియస్‌గా తీసుకోవద్దని, ఇందులో తాము చేసింది పెద్దగా ఏమీ లేదని ఆయన వ్యాఖ్యానించారు. విద్యార్థులు తమ కలల కోసం కష్టపడాలని, అప్పుడే సమాజంలో విజయం, గౌరవం దక్కుతాయని యశ్ సూచించారు.
మనం విఫలమైనప్పుడు ప్రపంచాన్ని నిందించకూడదని, దానికి మనమే బాధ్యులమని ఆయన స్పష్టం చేశారు. మన దేశంలో ఎన్నో రాష్ట్రాలు, భాషలు ఉన్నాయని, భాషల పేరుతో కొందరు రాజకీయాలు చేస్తున్నారని యశ్ అభిప్రాయపడ్డారు.
నార్త్, సౌత్ అనే తేడాలు మనకు అవసరం లేదని ఆయన చెప్పారు. మనం చేసే పనిని బట్టే ఎక్కడికెళ్లినా గౌరవం లభిస్తుందని యశ్ పేర్కొన్నారు.








