తెలంగాణ ప్రభుత్వం, క్విక్ కామర్స్ సంస్థ Zeptoతో కలిసి 'ప్రాజెక్ట్ ప్రగతి' పేరుతో ఒక ఒప్పందం చేసుకుంది. ఇందులో భాగంగా హైదరాబాద్ నగరంలో డెలివరీ బాయ్స్ కోసం ప్రత్యేకంగా ప్రగతి కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. తొలుత నగరంలో ఐదు కేంద్రాలను ప్రారంభించి, ఆ తర్వాత దశలవారీగా వీటి సంఖ్యను పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ కేంద్రాలను ఏ సంస్థకు చెందిన గిగ్ వర్కర్లు (యాప్ ఆధారిత ప్లాట్‌ఫామ్స్‌లో పనిచేసే డెలివరీ కార్మికులు) అయినా ఉపయోగించుకోవచ్చు. ఎండ, వాన, చలిని లెక్కచేయకుండా రోడ్లపై తిరిగే డెలివరీ బాయ్స్, పని మధ్యలో కాసేపు విశ్రాంతి తీసుకోవడానికి ఇవి ఉపయోగపడతాయి. త్రాగునీరు, వాష్ రూమ్స్, మొబైల్ ఛార్జింగ్, వైఫై, ఫస్ట్ ఎయిడ్ వంటి కనీస సౌకర్యాలు ఈ కేంద్రాల్లో అందుబాటులో ఉంటాయి.

పనివేళల్లో ఫోన్ ఛార్జింగ్ అయిపోయినప్పుడు, డెలివరీ బాయ్స్ ఈ కేంద్రాల్లో ఛార్జింగ్ పెట్టుకుని మళ్లీ పని కొనసాగించవచ్చు. రోడ్లపై ఎక్కువ సమయం గడపడం వల్ల వచ్చే అనారోగ్య సమస్యలను దృష్టిలో ఉంచుకుని, ఈ కేంద్రాల్లో ఎప్పటికప్పుడు ఉచిత మెడికల్ క్యాంపులు నిర్వహించనున్నారు. అంతేకాకుండా, కార్మికులకు ఈ-శ్రమ్ (అసంఘటిత రంగ కార్మికుల కోసం కేంద్ర ప్రభుత్వం అందించే గుర్తింపు కార్డు) రిజిస్ట్రేషన్‌పై అవగాహన కల్పించనున్నారు.

ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, సామాజిక భద్రతా కార్యక్రమాల గురించి కూడా ఈ కేంద్రాల ద్వారా కార్మికులకు వివరిస్తారు. ఈ కేంద్రాల ఏర్పాటుకు అవసరమైన నిధులను సమకూర్చడంతో పాటు, వీటి నిర్వహణ బాధ్యతలను Zepto సంస్థే చూసుకోనుంది. నగరంలో ఏయే ప్రాంతాల్లో ఈ కేంద్రాలను ఏర్పాటు చేయాలనే దానిపై త్వరలోనే స్పష్టత రానుంది.