వయసు పెరుగుతున్న కొద్దీ ఫిట్‌నెస్ తగ్గుతుందనే విమర్శలకు సల్మాన్ ఖాన్ తన కొత్త ఫొటోలతో చెక్ పెట్టారు. తెల్లవారుజామున 3 గంటల సమయంలో జిమ్ వర్కౌట్ పూర్తి చేసుకున్న ఆయన, షర్ట్‌లెస్‌గా ఉన్న రెండు ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. కండలు తిరిగిన శరీరంతో సిక్స్‌ప్యాక్ చూపిస్తూ అభిమానులను ఆశ్చర్యపరిచారు.
ఈ ఫొటోలకు ‘సల్మాన్ ఖాన్ డర్ర్ర్ర్ గయా… హ్మ్మ్… జో డర్ గయా వో మర్ గయా’ అని క్యాప్షన్ ఇచ్చారు. ఇటీవల ముంబైలో జరిగిన ఒక కార్యక్రమంలో సల్మాన్ లుక్‌పై సోషల్ మీడియాలో చర్చ జరగడం, కొందరు ఆయన ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేయడం వంటి పరిణామాల నేపథ్యంలో ఈ ఫొటోలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. తనపై వస్తున్న విమర్శలకు మాటలతో కాకుండా, ఫిట్‌నెస్‌తోనే సమాధానం ఇచ్చారని అభిమానులు భావిస్తున్నారు.
సినిమాల విషయానికి వస్తే, సల్మాన్ ఖాన్ ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఒక యాక్షన్ థ్రిల్లర్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాలో నయనతార కథానాయికగా నటిస్తుండగా, షూటింగ్ పనులు కొనసాగుతున్నాయి. మరోవైపు 2020 గాల్వాన్ లోయ ఘటనల ఆధారంగా రూపొందిన ‘మాతృభూమి’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది.
ఇటీవల నీట్ పరీక్ష వివాదంపై విద్యార్థులకు మద్దతు తెలపడంతో పాటు, నిరాహార దీక్ష చేస్తున్న సోనమ్ వాంగ్‌చుక్ ఆరోగ్యంపై కూడా సల్మాన్ స్పందించారు. సామాజిక అంశాలపై తన గళాన్ని వినిపిస్తూనే, మరోవైపు తన ఫిట్‌నెస్‌పై ఎలాంటి రాజీ లేదని తాజా ఫొటోలతో ఆయన నిరూపించారు.







