తనను, తన కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని కొందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలు బహిరంగంగా అవమానకరంగా మాట్లాడుతున్నారని మంత్రి కొండా సురేఖ ఆరోపించారు. ఈ వ్యాఖ్యల వెనుక ఒక అదృశ్యశక్తి ఉందని, ఆ వ్యక్తులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవికి రాసిన లేఖలో కోరారు.

కొండా సురేఖ కుమార్తె సుస్మితా పటేల్ ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చకు దారితీశాయి. దీనిపై స్పందించిన పార్టీ క్రమశిక్షణ కమిటీ మంత్రికి నోటీసులు జారీ చేయగా, ఆమె ఇప్పటికే తన వివరణను సమర్పించారు. తన కుమార్తె చేసిన వ్యాఖ్యలకు తనను బాధ్యురాలిని చేయడం సరికాదని ఆమె లేఖలో పేర్కొన్నారు.

అయితే, ఈ విచారణ కొనసాగుతుండగానే శుక్రవారం 16 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలు కలిసి ప్రెస్‌మీట్ నిర్వహించారు. మంత్రి కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తొలగించాలని, పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. పలువురు మహిళా కాంగ్రెస్ నేతలు కూడా మంత్రిపై, ఆమె కుమార్తెపై విమర్శలు గుప్పించారు.

ఈ పరిణామాలపై మంత్రి కొండా సురేఖ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు చేస్తున్న వ్యాఖ్యలు వారి సొంత అభిప్రాయాలుగా లేవని, ఎవరో వారిని ప్రేరేపిస్తూ సమన్వయం చేస్తున్నారని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. పార్టీ క్రమశిక్షణ కమిటీ విచారణ జరుగుతుండగా ఇలాంటి ఘటనలు జరగడం ఆందోళనకరమని ఆమె పేర్కొన్నారు.

తన రాజకీయ భవిష్యత్తుపై తీర్పులు ఇస్తూ, చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడం కమిటీ నిర్ణయాన్ని ప్రభావితం చేసే ప్రయత్నమని ఆమె ఆరోపించారు. బీసీ సీనియర్ మహిళా నాయకురాలైన తనపై సామూహిక దాడులు జరుగుతున్నప్పుడు పార్టీ నాయకత్వం మౌనంగా ఉండటంపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్న అసలు వ్యక్తులను గుర్తించి, పార్టీ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆమె కమిటీని కోరారు.