హుస్నాబాద్ సామాజిక ఆరోగ్య కేంద్రానికి ప్రతిరోజూ 30 నుంచి 40 మంది జ్వరంతో ఇన్‌పేషెంట్లుగా చేరుతున్నారు. గురువారం ఒక్కరోజే చికిత్స కోసం వచ్చిన 35 మందిలో ముగ్గురికి దోమల ద్వారా వ్యాపించే డెంగీ పాజిటివ్‌గా తేలింది. పది రోజుల క్రితం మరో బాలికకు కూడా డెంగీ సోకినట్లు వైద్యులు గుర్తించారు.

ఈ జ్వరాలు హుస్నాబాద్ పట్టణంతో పాటు అక్కన్నపేట, కోహెడ, బెజ్జంకి మండలాల్లోని గ్రామాలకు కూడా విస్తరించాయి. ప్రతి ఇంట్లో ఒకరు జ్వరంతో బాధపడుతున్నారని స్థానికులు చెబుతున్నారు. దోమల నివారణకు అధికారులు తగిన చర్యలు తీసుకోవడం లేదని, పారిశుధ్య పనుల్లో నిర్లక్ష్యం వహిస్తున్నారని ప్రజల నుంచి విమర్శలు వస్తున్నాయి.

మురుగు కాల్వల శుభ్రత, పిచ్చిమొక్కల తొలగింపు వంటి పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టడంలో అధికారులు విఫలమయ్యారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, జ్వరం లక్షణాలు కనిపిస్తే వెంటనే దవాఖానకు రావాలని వైద్యులు సూచిస్తున్నారు. హుస్నాబాద్ దవాఖానలో అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని వారు తెలిపారు.