శ్రీశైల దేవస్థానం ఆలయ బోర్డు ఛైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు, ఈవో (ఆలయ కార్యనిర్వహణాధికారి) యం.శ్రీనివాసరావు, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిశారు. హైదరాబాద్‌లోని ఆయన క్యాంప్ కార్యాలయంలో ఈ ఆహ్వాన పత్రికను అందజేశారు.
ఈనెల 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలను నిర్వహించనున్నట్లు వారు ముఖ్యమంత్రికి వివరించారు. ఈ సందర్భంగా ఆలయ పండితులు చంద్రబాబుకు వేదాశీర్వచనం పలికారు. దేవాలయ అధికారులు ఆయనకు శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల చిత్రపటాన్ని, ప్రసాదాలను అందించారు.
ఉత్సవాల ఏర్పాట్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ పది రోజుల పాటు అమ్మవారు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు. మొదటి రోజు శైలపుత్రిగా, రెండో రోజు బ్రహ్మచారిణిగా, మూడో రోజు చంద్రఘంటగా, నాలుగో రోజు కూష్మాండగా అమ్మవారి అలంకరణ ఉంటుంది.
ఐదో రోజు స్కందమాతగా, ఆరో రోజు కాత్యాయనిగా, ఏడో రోజు కాళరాత్రిగా, ఎనిమిదో రోజు మహాగౌరిగా, తొమ్మిదో రోజు సిద్ధిదాత్రిగా అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. చివరి రోజైన అక్టోబర్ 20న విజయదశమి సందర్భంగా అమ్మవారు నిజరూపంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు.
ఉత్సవాల ప్రారంభ సూచకంగా మొదటి రోజున శాస్త్రోక్తంగా యాగశాల ప్రవేశం, గణపతి పూజ, కలశ స్థాపన, ఘట స్థాపన, అఖండ దీపారాధన వంటి కార్యక్రమాలను దేవస్థానం నిర్వహించనుంది.







