శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో ఉన్న తన నివాసంలో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ అరెస్టును అడ్డుకునేందుకు వైసీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకోవడంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులను కార్యకర్తలు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితుల మధ్యే అప్పలరాజును పోలీసులు బలవంతంగా తరలించారు.

ఇటీవల ఆరవ్ వర్మ నడిపిన బైక్ ఢీకొట్టడంతో దానయ్య అనే గొర్రెల కాపరి మృతి చెందాడు. ఈ ప్రమాదానికి కారణమైన ఆరవ్ వర్మను కాపాడేందుకు అప్పలరాజు ప్రయత్నించారని పోలీసులు గుర్తించారు. ప్రమాద సమయంలో బైక్ నడిపింది ఆరవ్ వర్మ అని సీసీ కెమెరా ఫుటేజీ ద్వారా నిర్ధారణ కాగా, ఆయనకు బదులుగా సిద్ధార్థ త్యాడిని జైలుకు పంపేందుకు ప్రయత్నించారని ఆరోపణలు ఉన్నాయి.

ఈ కేసులో ఆరవ్ వర్మను ఏ1గా, సిద్ధార్థ త్యాడిని ఏ2గా, సీదిరి అప్పలరాజును ఏ3గా పోలీసులు చేర్చారు. ఇప్పటికే ఆరవ్, సిద్ధార్థలను పోలీసులు జైలుకు పంపారు. బాధిత కుటుంబాన్ని ప్రలోభపెట్టడం, నేరాన్ని కప్పిపుచ్చేందుకు ప్రయత్నించడం వంటి అభియోగాలపై అప్పలరాజుపై కేసు నమోదైంది.

ప్రమాదానికి రెండు రోజుల ముందే ఆరవ్ వర్మకు ఎల్‌ఎల్‌ఆర్ జారీ కావడంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై అప్పలరాజు ఇప్పటి వరకు ఎటువంటి ప్రకటన చేయలేదు. అప్పలరాజు సతీమణి న్యాయవాదితో కలిసి జిల్లా జైలుకు వెళ్లి ఆరవ్ వర్మను కలిశారు.