చెన్నైలోని శ్రీదేవి కుటుంబ ఆస్తికి సంబంధించి ప్రస్తుతం ఉన్న పరిస్థితినే కొనసాగించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ ఆస్తి వివాదంపై మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను జస్టిస్ కె.వి.విశ్వనాథన్, జస్టిస్ అరుణ్ పల్లీల ధర్మాసనం విచారించింది.
ఈ కేసులో బోనీ కపూర్, ఆయన కుమార్తెలు జాన్వీ కపూర్, ఖుషీ కపూర్‌లకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. 1988లో శ్రీదేవి, ఆమె తల్లి రాజేశ్వరి, సోదరి శ్రీలత కలిసి ఎం.సి. నిత్యానంద ముదలియార్ నుంచి ఈ ఆస్తిని కొనుగోలు చేశారు.
అయితే, ఈ ఆస్తి తమ తాతగారైన సంబంధ ముదలియార్‌దని ఎం.సి. శివకామి, ఆమె సోదరుడు నటరాజన్ వాదిస్తున్నారు. తమ తండ్రి చంద్రశేఖరన్ ద్వారా ఆ ఆస్తిలో ఐదో వంతు వాటా తమకు రావాలని వారు చెంగల్పట్టు కోర్టులో పిటిషన్ వేశారు. ఆ సేల్ డీడ్ (ఆస్తి అమ్మకపు పత్రం)ను రద్దు చేయాలని వారు కోరారు.
గతంలో ఈ పిటిషన్లను విచారించిన మద్రాస్ హైకోర్టు, శివకామి, నటరాజన్‌ల దావాను కొట్టివేసింది. వారి తండ్రి చంద్రశేఖరన్ మొదటి భార్య జీవించి ఉండగానే ఈ సంబంధం ఏర్పడిందని, కాబట్టి వీరికి వారసత్వ హక్కులు ఉండవని హైకోర్టు పేర్కొంది. కేవలం ఆస్తిని ఆక్రమించుకోవాలనే ఉద్దేశంతోనే ఈ వ్యాజ్యం వేశారని హైకోర్టు వ్యాఖ్యానించింది.
హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ బాధితులు సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో ఈ వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. ప్రస్తుతం అత్యున్నత న్యాయస్థానం జారీ చేసిన ఆదేశాల మేరకు, తదుపరి విచారణ వరకు ఆస్తి విషయంలో ఎటువంటి మార్పులు చేయడానికి వీలుండదు.








