శాయంపేట మండలంలోని సూరంపేట, గట్లకానిపర్తి, మాందారిపేట, పత్తిపాక, జోగంపల్లి, పెద్దకోడెపాక, నేరేడుపల్లి సహా పలు గ్రామాల్లో పత్తి పంటలు ఎండిపోతున్నాయి. పూత, కాత దశకు రావాల్సిన మొక్కలు ఎండల తీవ్రతకు మాడిపోతుండటంతో రైతులు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారు.

వర్షాలు లేకపోవడంతో చాలా మంది రైతులు రెండు, మూడు సార్లు విత్తనాలు వేసి అదనపు ఖర్చు చేశారు. అయితే, మొలకలు వచ్చినా సరైన తేమ లేక పంట ఎదగడం లేదు. అప్పుడప్పుడు పడుతున్న ముసురు వల్ల మొక్కలు పెరగకపోగా, కలుపు మొక్కలు మాత్రం విపరీతంగా పెరుగుతున్నాయి.

భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో పంటకు నీరు పెట్టే అవకాశం కూడా లేకుండా పోయింది. విత్తనాలు, కూలీలు, ఎరువుల కోసం ఇప్పటికే వేలాది రూపాయలు ఖర్చు చేసిన రైతులు, పంట చేతికి వచ్చే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాలుగెకరాల్లో పత్తి సాగు చేసిన ఒక రైతు ఇప్పటికే లక్ష రూపాయలు ఖర్చు చేసినా, మొక్కలు కేవలం ఒక అడుగు ఎత్తులోనే ఆగిపోయాయని వాపోయారు.