దాతల నుండి సేకరించిన అవయవాలు మంచుపై ఉంచినప్పటికీ, శరీరం వెలుపల కొన్ని గంటల పాటు మాత్రమే జీవించి ఉంటాయి. ఈ కొరతను అధిగమించేందుకు వైద్యులు ఆర్గన్ బ్యాంకులను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఇవి మానవ అవయవాలను రోజులు, వారాలు లేదా నెలల పాటు భద్రపరిచి, సరైన గ్రహీతలకు తరలించేందుకు వీలు కల్పిస్తాయి.
తాజా పరిశోధనలో భాగంగా, శాస్త్రవేత్తల బృందం పందుల మూత్రపిండాలను మైనస్ 4 డిగ్రీల సెల్సియస్ వద్ద నిల్వ చేసింది. ఈ ఉష్ణోగ్రత వద్ద అవయవాలు పాడవకుండా జీవించి ఉన్నాయి. ఆ తర్వాత వీటిని తిరిగి పందులలో అమర్చగా, అవి పనిచేయడం గమనార్హం. సాధారణంగా అవయవాలను గడ్డకట్టేలా చల్లబరిస్తే, వాటిలో మంచు స్ఫటికాలు ఏర్పడి కణజాలం దెబ్బతింటుంది.
దీనిని నివారించేందుకు క్రయోప్రిజర్వేషన్ అనే పద్ధతిపై నిపుణులు దృష్టి సారించారు. వేగంగా చల్లబరచడం ద్వారా కణాలను గాజు వంటి స్థితిలో ఉంచే ఈ ప్రక్రియ, ప్రస్తుతం గుడ్లు, వీర్యాలు మరియు భ్రూణాల నిల్వకు వాడుతున్నారు. వీటిని మైనస్ 196 డిగ్రీల వద్ద దశాబ్దాల పాటు భద్రపరచవచ్చు. అయితే, మానవ అవయవాలను ఈ పద్ధతిలో భద్రపరిచి, తిరిగి ప్రాణం పోయడం ఇప్పటికీ సవాలుగానే ఉంది.
మరోవైపు, భవిష్యత్తులో తిరిగి ప్రాణం పోయవచ్చనే ఆశతో కొందరు తమ శరీరాలను, మెదళ్లను అతి తక్కువ ఉష్ణోగ్రతల వద్ద నిల్వ చేయించుకుంటున్నారు. 2014లో జెరాంటాలజిస్ట్ స్టీఫెన్ ఎల్. కోల్స్ మరణం తర్వాత, అతని మెదడును అరిజోనాలోని ఆల్కర్ కేంద్రానికి తరలించారు. అక్కడ శాస్త్రవేత్తలు అతని మెదడుకు క్రయోప్రాటెక్టివ్ రసాయనాలను పంపి, మైనస్ 146 డిగ్రీల వద్ద భద్రపరిచారు.








