ప్రతి 100 గ్రాముల రాగులలో 336 నుండి 350 కేలరీలు, 344 మి.గ్రా కాల్షియం, 7 గ్రాముల ప్రొటీన్, 11 గ్రాముల పీచు పదార్థం (ఫైబర్) ఉంటాయి. ఈ పోషకాలు శరీర ఆరోగ్యాన్ని కాపాడటంతో పాటు ఒంటిని చల్లబరుస్తాయని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు.
రాగి జావ తయారీ కోసం పావు కప్పు రాగి పిండిని నీటిలో ఉండలు లేకుండా కలిపి, మరిగే నీటిలో పోసి రెండు నిమిషాలు ఉడికించాలి. ఈ మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత, పెరుగుతో చేసిన మజ్జిగను అందులో కలపాలి.
రుచి కోసం ఆవాలు, పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకుతో తాలింపు వేసి ఈ మిశ్రమంలో కలపాలి. చివరగా ఉల్లిపాయ ముక్కలు, నిమ్మరసం, కొత్తిమీర జోడించడం వల్ల రుచితో పాటు జీర్ణశక్తి కూడా పెరుగుతుంది.
ఈ పద్ధతిలో తయారు చేసుకున్న రాగి జావను రోజూ ఒక గ్లాసు తాగడం వల్ల రోజంతా ఉత్సాహంగా, చల్లగా ఉండవచ్చు. సాధారణంగా రాగి జావ తాగడానికి ఇష్టపడని వారు కూడా ఈ మసాలా వెర్షన్‌ను ఇష్టంగా తాగుతారని నిపుణులు చెబుతున్నారు.








