కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం మొలంగూర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి (జీపీఓ) శ్రీనివాస్‌ను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు అరెస్ట్ చేశారు. లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు అతడిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
మొలంగూర్ గ్రామానికి చెందిన ఒక రైతు తన వ్యవసాయ భూమి పట్టాను భార్య, కుమారుడి పేర్లపై మార్చాలని జూలై 21న ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నాడు. ఈ దరఖాస్తును పరిశీలించి రిజిస్ట్రేషన్ చేసేందుకు అనుమతులు ఇవ్వాలంటే రూ. 25 వేలు లంచం ఇవ్వాలని కార్యదర్శి శ్రీనివాస్ డిమాండ్ చేశాడు.
లంచం ఇవ్వడం ఇష్టం లేని రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో గురువారం సాయంత్రం శంకరపట్నం తహసీల్దార్ కార్యాలయంలో రైతు నుంచి డబ్బులు తీసుకుంటున్న శ్రీనివాస్‌ను పట్టుకున్నారు.
ఈ దాడుల్లో ఏసీబీ సీఐలు తిరుపతి, ప్రేమ్‌కుమార్‌లతో పాటు ఇతర సిబ్బంది పాల్గొన్నారు. శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకున్నట్లు కరీంనగర్ రేంజ్ ఏసీబీ డీఎస్పీ మహేందర్‌రెడ్డి వెల్లడించారు.
విచారణ ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత నిందితుడిని ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్లు డీఎస్పీ తెలిపారు.








