శనిగ్రహం ఉత్తర, దక్షిణ ధ్రువాలను కమ్మేసిన అమ్మోనియా వాయువుతో కూడిన మేఘాల్లో వింత తరంగ ప్రవాహాలు ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. 1980లలో వాయేజర్-1, వాయేజర్-2 అనే అంతరిక్ష నౌకలు శని ఉత్తర ధ్రువం వద్ద ఆరు భుజాలు కలిగిన షట్భుజి ఆకారపు తరంగ ప్రవాహాలను మొదటిసారిగా చూశాయి.
ఇప్పుడు స్పెయిన్ శాస్త్రవేత్తలు శని దక్షిణ ధ్రువంపై పది భుజాలు కలిగిన దశభుజి తరంగ ప్రవాహాలు ఉన్నట్లు తాజాగా తేల్చారు. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసాకు చెందిన హబుల్ టెలిస్కోపు 2023లో తీసిన చిత్రాల ద్వారా ఈ వివరాలు బయటపడ్డాయి.
ఈ తరంగ ప్రవాహాల ఆనవాళ్లు అంతకుముందు లేవు కాబట్టి, ఇవి 2017 నుంచి 2023 మధ్య కాలంలో ఏర్పడి ఉండవచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఈ ఆరేళ్ల సమయంలో శనిగ్రహ దక్షిణ ధ్రువం భూమికి వ్యతిరేక దిశలో ఉంది.
ఈ దశభుజి తరంగ ప్రవాహంలో ఒక్కో భుజం ఏకంగా 16,700 కిలోమీటర్ల పొడవు ఉండటం గమనార్హం. ఈ పరిశోధనలో పాల్గొన్న యూనివర్శిటీ ఆఫ్ బసేక్ కంట్రీ శాస్త్రవేత్త అగస్టీన్ సాంచేజ్ లవేగా మాట్లాడుతూ, షట్భుజి ఆకారం ప్రత్యేకమని భావిస్తుండగా, ఈ దశభుజి ఆకారం తమను మరింత ఆశ్చర్యానికి గురి చేసిందని తెలిపారు.
సౌర కుటుంబంలో మెర్కురీ గ్రహం మినహా మిగిలిన గ్రహాలపై వాతావరణం ఉన్నప్పటికీ, ఇలాంటి షట్భుజి, దశభుజి ఆకారపు తరంగ ప్రవాహాలు శనిగ్రహంపై మాత్రమే కనిపిస్తున్నాయి. భూమి వాతావరణంపై వాయు ప్రవాహాల ప్రభావం ఉన్నట్లే, శనిగ్రహంపై కూడా ఈ తరంగ ప్రవాహాల ప్రభావాన్ని తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు.








