నకిరేకల్ పట్టణంలో పాత జాతీయ రహదారి పక్కన నిర్మించిన ఈ కొత్త ఆసుపత్రి భవన పనులు ఐదు నెలల క్రితమే పూర్తయ్యాయి. రూ.32 కోట్ల వ్యయంతో సిద్ధం చేసిన ఈ 100 పడకల ఏరియా ఆసుపత్రిని సెప్టెంబర్ 5న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారికంగా ప్రారంభించనున్నారు.

ఈ ప్రాంతంలో 1990 కంటే ముందు 30 పడకలతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC) ఉండేది. ఆ తర్వాత 1998లో దీనిని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌గా మార్చారు. రోజువారీ రోగుల సంఖ్య పెరగడంతో, 2022లో దీనిని 100 పడకల ఆసుపత్రిగా ప్రభుత్వం అప్‌గ్రేడ్ చేసింది.

ప్రస్తుతం పాత ఆసుపత్రిలో రోజుకు 200 నుంచి 250 మంది రోగులు ఓపీ (ఔట్ పేషెంట్ - ఆసుపత్రిలో చేరకుండానే వైద్యుడిని సంప్రదించేవారు) సేవలు పొందుతున్నారు. గతంలో ఓపీ సంఖ్య రోజుకు 350 నుంచి 500 వరకు నమోదయ్యేది.

కొత్త ఆసుపత్రి ప్రారంభమై పూర్తిస్థాయి వైద్య సేవలు అందుబాటులోకి వస్తే రోగుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ ఆసుపత్రి అందుబాటులోకి రావడం నకిరేకల్ ప్రజల చిరకాల కోరిక అని స్థానికులు చెబుతున్నారు.

ఈ ఆసుపత్రి ద్వారా నకిరేకల్‌తో పాటు పరిసర ఆరు మండలాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు చేరువ కానున్నాయి. సెప్టెంబర్ 5న జరిగే ప్రారంభోత్సవం తర్వాత ఆసుపత్రిలో పూర్తిస్థాయి వైద్య సేవలు రోగులకు అందుబాటులోకి రానున్నాయి.