జనసేన పార్టీ తన యువజన విభాగాన్ని సెప్టెంబర్ 2న అధికారికంగా ప్రారంభించనుంది. పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా పిఠాపురంలో ఉదయం 11 గంటలకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. పార్టీ నాయకులు, జనసైనికులు, వీర మహిళల సమక్షంలో ఈ విభాగం ఆవిష్కరణ జరగనుంది.

ప్రస్తుతం కేరళలో చికిత్స పొందుతున్న పవన్ కళ్యాణ్, ఆన్‌లైన్ ద్వారా పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమంలో యువజన విభాగం లోగోను, ప్రత్యేక గీతాన్ని ఆవిష్కరించనున్నారు. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి, పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.

యువతలో రాజకీయ చైతన్యం పెంచడం, వారిని పార్టీ కార్యకలాపాల్లో చురుకుగా భాగస్వామ్యం చేయడం ఈ విభాగం ప్రధాన లక్ష్యమని పార్టీ వర్గాలు తెలిపాయి. యువతకు రాజకీయంగా ప్రోత్సాహం అందించే అంశాలపై పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేయనున్నారు.

పిఠాపురంలోని ప్రధాన కార్యక్రమంతో పాటు, ఆంధ్రప్రదేశ్‌లోని 175 నియోజకవర్గాల్లో ప్రత్యేక వేడుకలు నిర్వహించేందుకు పార్టీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నాయి. అంతేకాకుండా, జనసేన ప్రభావం ఉన్న తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా సెప్టెంబర్ 2న ఈ ఆవిష్కరణ కార్యక్రమాలను చేపట్టేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.