సికింద్రాబాద్‌లో లష్కర్ బోనాల వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయానికి చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. గర్భగుడిలో అమ్మవారిని దర్శించుకున్న ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో, పాడిపంటలతో వర్ధిల్లాలని ప్రార్థించారు.
ఈ పూజా కార్యక్రమాల్లో మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, సీతక్కలతో పాటు ఎమ్మెల్యేలు దానం నాగేందర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. అంతకుముందు ఉదయం రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వం తరఫున మొదటి బోనాన్ని అమ్మవారికి సమర్పించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సాధారణ భక్తుల కోసం మూడు క్యూ లైన్లు, బోనాలు సమర్పించే వారి కోసం రెండు ప్రత్యేక లైన్లను సిద్ధం చేశారు. లక్షలాది మంది భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో, ఆలయ పరిసరాల్లో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. నిరంతర పర్యవేక్షణ కోసం సీసీటీవీ కెమెరాలను అమర్చారు.
భక్తుల సౌకర్యార్థం ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక నీటి కేంద్రాలను ఏర్పాటు చేశారు. వైద్య ఆరోగ్య శాఖ పర్యవేక్షణలో హెల్త్ క్యాంపులను నిర్వహించడంతో పాటు, అత్యవసర సేవల కోసం అంబులెన్స్‌లను అందుబాటులో ఉంచారు.






