తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ కలత్తూరు ఎంపీటీసీ పట్టాభిరామిరెడ్డిని టీడీపీ నేతలు కిడ్నాప్ చేశారు. కేవీబీపురం మండలంలో ఎంపీపీ పదవి కోసం టీడీపీ కుట్రలకు తెరలేపిందని, ఈ ఘటనతో పట్టాభిరామిరెడ్డి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారని వైఎస్సార్‌సీపీ తెలిపింది.

కేవీబీపురం మండలంలో ఎంపీపీ పదవికి రేపు పరోక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ మండలంలో వైఎస్సార్‌సీపీకి, టీడీపీకి చెరో 6 ఎంపీటీసీ స్థానాలు వచ్చాయి. మెజారిటీ సాధించడం కోసం వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీని టీడీపీ నేతలు కిడ్నాప్ చేశారని ఆరోపణలు వచ్చాయి.

గతంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ కౌంటింగ్ సమయంలోనూ టీడీపీ కుట్ర రాజకీయాలు చేసిందని వైఎస్సార్‌సీపీ పేర్కొంది. కాళంగి అదరం ఎంపీటీసీ స్థానం నుంచి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి లక్ష్మీ శోభన గెలుపొందగా, ఎన్నికల కౌంటింగ్ రోజు కుట్ర చేసి టీడీపీ అభ్యర్థి మీనాక్షి గెలిచినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారని తెలిపింది. తాజా కిడ్నాప్‌తో ఎంపీపీ పదవిని దక్కించుకోవాలని టీడీపీ ప్రయత్నిస్తోందని వెల్లడించింది.

ఈ పరిణామాలపై వైఎస్సార్‌సీపీ ఎంపీ గురుమూర్తి తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలో అంబేద్కర్‌ రాజ్యాంగం అమలులో లేదని, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని ఆయన మండిపడ్డారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల సమయంలో భారీ ఎత్తున అక్రమాలు జరిగాయని, కేవీబీపురం జడ్పీటీసీ స్థానంలో వైఎస్సార్‌సీపీ గెలిచినా టీడీపీ గెలిచినట్లు ప్రకటించారని ఆరోపించారు.

టీడీపీ అరాచకాలపై న్యాయ పోరాటం చేస్తామని ఎంపీ గురుమూర్తి స్పష్టం చేశారు. ఎంపీపీ ఎన్నికల కోసం సాగిస్తున్న ఈ అక్రమాలను న్యాయపరంగా ఎదుర్కొంటామని చెప్పారు.