సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం బిల్లాపూర్‌లో పేదలు నిర్మించుకున్న షెడ్లను కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చివేసింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి పంపిణీ చేసిన పట్టాల స్థలంలో ఈ షెడ్లు ఉన్నాయి. వీటి ద్వారా పేదలు చిరువ్యాపారాలు చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నారు.
స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే సంజీవ రెడ్డి అండతోనే అధికారులు ఈ దౌర్జన్యానికి పాల్పడ్డారని బాధితులు చెబుతున్నారు. తమకు కనీసం ముందస్తు నోటీసులు కూడా ఇవ్వకుండానే, రాత్రికి రాత్రి బుల్డోజర్లతో షెడ్లను నేలమట్టం చేశారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ ఘటనపై మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఆయన వెంటనే బిల్లాపూర్ గ్రామానికి చేరుకుని, కూల్చివేత జరిగిన ప్రాంతంలో స్థానికులతో కలిసి రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన రాస్తారోకో నిర్వహించి తన నిరసనను వ్యక్తం చేశారు.








