తుపాకీ పట్టి అడవుల్లో పోరాడిన మాజీ మావోయిస్టులు, ఇప్పుడు బ్యాలెట్ ద్వారా ప్రజాస్వామ్య రాజకీయాల్లోకి రావాలని చూస్తున్నారు. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ మాజీ సభ్యుడు దేవ్ జీ ఈ దిశగా చొరవ తీసుకుంటున్నారు. లొంగిపోయిన మాజీ మావోయిస్టులందరినీ ఏకం చేసి, ఒకే వేదికపైకి తీసుకురావాలని ఆయన ప్రయత్నిస్తున్నారు.

తాజాగా ఎన్‌టీవీతో మాట్లాడిన దేవ్ జీ, తాము ఇప్పటికీ సీపీఐ మావోయిస్టు పార్టీకే చెందినవారమని స్పష్టం చేశారు. అయితే, ఆ పార్టీపై ప్రభుత్వం నిషేధం కొనసాగుతోంది. ఈ పరిస్థితుల్లో అదే పేరుతో రాజకీయ కార్యకలాపాలు నిర్వహించడం సాధ్యమా లేదా కొత్త పేరు, జెండాతో ముందుకు వస్తారా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడాలంటే ఒక వేదిక కచ్చితంగా ఉండాలని మాజీ నాయకులు భావిస్తున్నారు. అది ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటేనే ఎక్కువ మంది ప్రజలు కలిసి వచ్చే అవకాశం ఉంటుందని వారు లెక్కలేస్తున్నారు. గతంలో నేపాల్‌లో సాయుధ పోరాటం విరమించిన ప్రచండ, కమ్యూనిస్ట్ పార్టీని స్థాపించి ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన ఉదంతాన్ని కొందరు ఉదాహరణగా చూపిస్తున్నారు.

అయితే, ఈ ప్రయాణంలో అనేక సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సిద్ధాంతపరమైన విభేదాలు, ఎన్నికలపై గతంలో వారికి ఉన్న వైఖరి, రాజకీయ వ్యూహాలు వంటి అంశాలు వారిని ఏకం చేయడంలో అడ్డంకులుగా మారవచ్చు. ముఖ్యంగా ఇప్పటికీ అడవుల్లో ఉన్న మావోయిస్టు నాయకత్వం నుంచి ఎలాంటి స్పందన వస్తుందన్నది కీలకంగా మారింది.

అడవుల్లో ఉన్న నాయకత్వం నుంచి వ్యతిరేకత వస్తే, లొంగిపోయిన వారు ధైర్యంగా ముందుకు అడుగు వేయగలరా అన్నది పెద్ద ప్రశ్నగా మిగిలింది. దేవ్ జీ అనుకున్నట్లుగా రాజకీయ వేదిక సిద్ధమైతే, అది మావోయిస్టుల ప్రస్థానంలో ఒక కీలక మలుపు అవుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.