గన్నేరువరం మండలం గుండ్లపల్లి నుండి గన్నేరువరం మండల కేంద్రం, ఇల్లంతకుంట మండలం వరకు రోడ్డు పనులు మంజూరయ్యాయి. అయితే ఈ పనులు పూర్తికాకపోవడంతో రోడ్డు అధ్వానంగా తయారైంది.

ఈ సమస్యపై జంగాపల్లి గ్రామానికి చెందిన మూడో తరగతి విద్యార్థిని శ్వేతాన్షి సోషల్ మీడియాలో ఒక వీడియోను పోస్ట్ చేసింది. ఇందులో ఆమె తన పేరు శ్వేతాన్షి అని, మూడో తరగతి చదువుతున్నానని ఇంగ్లీషులో పరిచయం చేసుకుంది.

రోడ్డు పరిస్థితి దారుణంగా ఉండటంతో తాము స్కూలుకు వెళ్లడానికి చాలా ఇబ్బంది పడుతున్నామని ఆ చిన్నారి వివరించింది. గ్రామస్తులు ఎదుర్కొంటున్న కష్టాలను ఆమె ఆ వీడియోలో ప్రస్తావించింది.

తమ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రోడ్డును త్వరగా వేయించాలని ఆమె సీఎంను కోరింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా వ్యాపించింది.