తెలంగాణలో పేద మహిళల పెళ్లిళ్ల కోసం ప్రభుత్వం ఇచ్చే కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల అమలుపై హైకోర్టు మధ్యంతర స్టే విధించింది. ఈ పథకాలపై ప్రభుత్వం కోర్టులో బలమైన వాదనలు వినిపించలేదని, కౌంటర్ అఫిడవిట్ సమర్పించడంలో నిర్లక్ష్యం వహించిందని బీఆర్‌ఎస్ ఆరోపించింది.

ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాలతో, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లతో అత్యవసర టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఈ పథకాల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆయన మండిపడ్డారు. పేదలకు ఆసరాగా నిలిచే ఈ పథకాలను యథావిధిగా కొనసాగించాలని పార్టీ డిమాండ్ చేసింది.

పార్టీ నిర్ణయం ప్రకారం, రేపు తెలంగాణలోని అన్ని నియోజకవర్గాల్లో ఆర్డీవో కార్యాలయం ఎదుట బీఆర్‌ఎస్ భారీ ధర్నాలు చేపట్టనుంది. సిద్దిపేటలో జరిగే నిరసనలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొననుండగా, మిగిలిన చోట్ల స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.

మరోవైపు, సెప్టెంబర్‌లో అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తామని, పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనపై చర్చకు రావాలని సీఎం రేవంత్ రెడ్డి విసిరిన సవాల్‌పై బీఆర్‌ఎస్ స్పందించింది. అసెంబ్లీ వేదికగానే కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను, రైతులు, నిరుద్యోగుల సమస్యలను నిలదీస్తామని ఆ పార్టీ నేతలు స్పష్టం చేశారు.