రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ సమీపంలోని జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. విజయవాడ నుంచి హైదరాబాద్‌కు ప్రయాణికులను తీసుకెళ్తున్న ఆర్టీసీ బస్సు, అక్కడ ఆగి ఉన్న డీసీఎం వాహనాన్ని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది.

ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 48 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ఘటనలో పది మందికి గాయాలయ్యాయని పోలీసులు గుర్తించారు. గాయపడిన వారిని వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.

ఇదే సమయంలో కరీంనగర్ జిల్లాలో మరో ఆర్టీసీ బస్సు ప్రమాదం తృటిలో తప్పింది. హుస్నాబాద్ డిపోకు చెందిన బస్సు 50 మంది ప్రయాణికులతో హుస్నాబాద్ నుంచి కరీంనగర్ వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

చిగురుమామిడి మండలం సుందరగిరి వద్ద కొత్తపల్లి ఫోర్ లేన్ రోడ్డు పనులు జరుగుతున్నాయి. అక్కడ రోడ్డుపై బస్సు ఒక్కసారిగా ఎగిరిపడటంతో స్టీరింగ్ రాడ్ విరిగిపోయింది. దీంతో డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో బస్సు రోడ్డు పక్కనే ఉన్న ఒక వ్యవసాయ బావి వైపు దూసుకెళ్లింది.

బస్సు ముందు టైర్లు బావిలోకి వేలాడుతూ అంచున ఆగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడటంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.