ఉమ్మడి అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులపై ఇటీవల సోషల్ మీడియాలో 'నాన్ లోకల్' అనే ప్రచారం మొదలైంది. ఆయన సొంతూరు శింగనమల నియోజకవర్గంలోని బుక్కరాయ సముద్రం మండలం అగ్రహారం. గతంలో జర్నలిస్టుగా పనిచేసిన కాల్వ శ్రీనివాసులకు చంద్రబాబు ఎంపీ టికెట్ ఇవ్వడంతో ఆయన రాజకీయ ప్రస్థానం మొదలైంది. ఆ తర్వాత అసెంబ్లీకి వెళ్లాలన్న లక్ష్యంతో ఆయన రాయదుర్గం నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు.
2014 ఎన్నికల్లో రాయదుర్గం నుంచి విజయం సాధించిన కాల్వ శ్రీనివాసులు, ఆ తర్వాత ప్రభుత్వ విప్‌గా, మంత్రిగా పనిచేశారు. 2019 ఎన్నికల్లో ఓటమి చెందినప్పటికీ, ఐదేళ్ల పాటు నియోజకవర్గంలోనే ఉంటూ ప్రత్యర్థి కాపు రామచంద్రారెడ్డితో పోరాడారు. 2024 ఎన్నికల్లో మరోసారి గెలిచి, ప్రస్తుతం ప్రభుత్వ విప్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఒకటిన్నర దశాబ్ద కాలంగా ఇక్కడే రాజకీయాలు చేస్తున్న తనపై నాన్ లోకల్ ముద్ర వేయడం సరికాదని తెలుగుదేశం పార్టీ నాయకులు కౌంటర్ ఇస్తున్నారు.
ఈ ప్రచారాన్ని మొదలుపెట్టింది ఎవరనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. రాయదుర్గంలో వైసీపీ నాయకులు యాక్టివ్‌గా లేకపోవడంతో, కూటమి పార్టీలకు చెందిన నేతలే ఈ ప్రచారాన్ని తెరపైకి తెచ్చారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, ఇలాంటి ప్రచారాలకు తాను భయపడేది లేదని, చేసేది సొంతవారైనా, పగవారైనా తనకు అనవసరమని కాల్వ శ్రీనివాసులు స్పష్టం చేశారు.
కనిపించని శత్రువుతో పోరాటం కష్టమైనప్పటికీ, ఈ ప్రచారాన్ని కనుగొని అడ్డుకోకపోతే అది భవిష్యత్తులో ఇబ్బందికరంగా మారుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.







