రాంచీలోని ఒర్మాంజీ బ్లాక్ చౌక్ సమీపంలో ఉన్న ఓ మద్యం షాపులోకి శుక్రవారం ఒక కోతి అకస్మాత్తుగా ప్రవేశించింది. షాపు సిబ్బంది దానిని బయటకు పంపేందుకు ప్రయత్నించగా, అది యజమానిపై దాడి చేసి కొరికింది. దీంతో భయపడిన సిబ్బంది దుకాణం నుంచి బయటకు పరుగులు తీశారు.

షాపులో ఎవరూ లేని సమయంలో, ఆ కోతి కౌంటర్‌పై ఉన్న మద్యం బాటిల్‌ను తీసుకుని తాగేసింది. ఆల్కహాల్ ప్రభావంతో మత్తులోకి జారుకున్న ఆ వానరం, దుకాణంలోనే పడుకుని గురకపెట్టడం మొదలుపెట్టింది.

ఈ వింత విషయం తెలియడంతో స్థానికులు భారీగా మద్యం షాపు వద్దకు చేరుకున్నారు. మత్తులో ఉన్న కోతిని చూసేందుకు జనం ఎగబడటమే కాకుండా, ఆ దృశ్యాలను తమ ఫోన్లలో చిత్రీకరించారు. ఈ వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో విస్తృతంగా వ్యాపించాయి.

కోతి గాఢ నిద్రలో ఉండటాన్ని గమనించిన స్థానికులు, వెంటనే అటవీ శాఖ మరియు రెస్క్యూ బృందానికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ సిబ్బంది, కోతికి ఎలాంటి హాని కలగకుండా జాగ్రత్తగా పట్టుకున్నారు.

చివరికి రెస్క్యూ సిబ్బంది ఆ కోతిని సురక్షిత ప్రాంతానికి తరలించారు. గతంలో ఒక సెలూన్‌లోకి వెళ్లి మసాజ్ చేయించుకున్న కోతి వీడియో కూడా ఇలాగే నెట్టింట వైరల్ అయిందని నెటిజన్లు గుర్తుచేస్తున్నారు.