రాజస్థాన్‌లోని జైపూర్ జిల్లా రాంపురా కన్వర్‌పురా గ్రామంలో కాక్రోచ్ జనతా పార్టీ (CJP) కార్యకర్తలకు చేదు అనుభవం ఎదురైంది. పాఠశాల మరమ్మతుల పనులను పర్యవేక్షించే 'స్కూల్ ఠీక్ కరో' (పాఠశాలలను బాగు చేయండి) అనే ప్రచారంలో భాగంగా సీజేపీ కార్యకర్తలు ఆ గ్రామానికి వెళ్లారు.
అయితే, సీజేపీ బృందం గ్రామంలోకి ప్రవేశించగానే స్థానికులు వారిని అడ్డుకున్నారు. గ్రామ ప్రధాన రహదారిని మూసివేసి, కార్యకర్తలతో గ్రామస్థులు వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.
గ్రామస్థులు సీజేపీ కార్యకర్తలపై చేయి చేసుకుని, వారిని ఊరి నుంచి తరిమేశారు. ఈ గొడవలో కొన్ని వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో గ్రామస్థులకు భారతీయ జనతా పార్టీ (BJP) కార్యకర్తలు మద్దతుగా నిలిచినట్లు సమాచారం.
పాఠశాల మరమ్మతులను తామే చేసుకుంటామని, ఇప్పటికే తమకు అందుకు తగిన నిధులు వచ్చాయని గ్రామస్థులు స్పష్టం చేశారు. పాఠశాల భవనం ప్రస్తుతం శిథిలావస్థలో ఉండటంతో, విద్యార్థులకు సమీపంలోని గోవుల కొట్టంలో తరగతులు నిర్వహిస్తున్నారు.
సీజేపీ కార్యకర్తల రాకను నిరసిస్తూ గ్రామస్థులు పాఠశాల ముందు బైఠాయించి నినాదాలు చేశారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది.








