ధనుష్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన 'Raayan' సినిమాకు ఉత్తమ తమిళ చిత్రంగా జాతీయ అవార్డు దక్కింది. ఈ అవార్డు వేడుకల తర్వాత చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో ధనుష్ ప్రయాణానికి సిద్ధమవుతుండగా మీడియా ప్రతినిధులు ఆయనను కలిశారు.
ఈ సమయంలో అక్కడున్న ఒక రిపోర్టర్ ధనుష్‌ను ఉద్దేశించి, 'మనం రాజకీయ పార్టీ ఎప్పుడు ప్రారంభిస్తున్నాం?' అని సరదాగా అడిగారు. తమిళ నటుడు విజయ్ రాజకీయాల్లోకి ప్రవేశించిన నేపథ్యంలో, ధనుష్ కూడా అదే బాటలో నడుస్తారనే వార్తలు వస్తున్న తరుణంలో ఈ ప్రశ్న వచ్చింది.
అయితే ఈ ఊహించని ప్రశ్నకు ధనుష్ ఎలాంటి సమాధానం చెప్పలేదు. రాజకీయాల గురించి ఏ విధమైన వ్యాఖ్యలు చేయకుండా, కేవలం చిరునవ్వు నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.
ప్రస్తుతం ధనుష్ స్పందనకు సంబంధించిన ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా వ్యాపిస్తోంది. ఆయన రాజకీయ ప్రవేశంపై వస్తున్న ఊహాగానాలపై ధనుష్ ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.








