భారత క్రికెట్ చరిత్రలో ‘ది వాల్’గా గుర్తింపు పొందిన రాహుల్ ద్రవిడ్, అంతర్జాతీయ స్థాయిలో 500కు పైగా మ్యాచ్‌లు ఆడి తనదైన ముద్ర వేశారు. ఆయన కెరీర్‌లో సాధించిన మూడు టెస్ట్ రికార్డులు ఇప్పటికీ ఎవరూ అందుకోలేనివిగా నిలిచిపోయాయి. ముఖ్యంగా టెస్ట్ క్రికెట్‌లో అత్యధికంగా 31,258 బంతులను ఎదుర్కొన్న బ్యాటర్‌గా ద్రవిడ్ అగ్రస్థానంలో ఉన్నారు. ఈ జాబితాలో 29,437 బంతులతో సచిన్ టెండూల్కర్ రెండో స్థానంలో కొనసాగుతున్నారు.

క్రీజులో ఎక్కువ సమయం గడపడంలో కూడా ద్రవిడ్ ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నారు. తన టెస్ట్ కెరీర్‌లో 286 ఇన్నింగ్స్‌లు ఆడి, మొత్తం 44,152 నిమిషాల పాటు ఆయన క్రీజులో నిలిచారు. సచిన్ టెండూల్కర్ 329 ఇన్నింగ్స్‌లలో 41,304 నిమిషాలు క్రీజులో గడిపి రెండో స్థానానికి పరిమితమయ్యారు. బ్యాటింగ్ శైలిలో సహనం, పట్టుదలకు ఈ గణాంకాలు నిదర్శనంగా నిలుస్తాయి.

టెస్టుల్లో అత్యధిక సెంచరీ భాగస్వామ్యాలు నెలకొల్పిన రికార్డు కూడా ద్రవిడ్ పేరిటే ఉంది. కెరీర్‌లో 100 లేదా అంతకంటే ఎక్కువ పరుగుల భాగస్వామ్యాల్లో ఆయన 88 సార్లు భాగస్వామిగా ఉన్నారు. సచిన్ టెండూల్కర్ 86 సెంచరీ భాగస్వామ్యాలతో ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్నారు. వీరిద్దరూ కలిసి టెస్టుల్లో 20 సెంచరీ భాగస్వామ్యాలను నమోదు చేయడం విశేషం.

ఆటగాడిగా రిటైర్ అయిన తర్వాత కోచ్‌గా కూడా ద్రవిడ్ తన సేవలను కొనసాగించారు. ఆయన మార్గదర్శకత్వంలో 2018 అండర్-19 ప్రపంచకప్ విజయం, 2024 టీ20 ప్రపంచకప్ విజయం టీమిండియా సొంతమైంది. అలాగే 2023 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్, వన్డే ప్రపంచకప్ ఫైనల్స్‌కు భారత్ చేరుకోవడంలో ద్రవిడ్ కీలక పాత్ర పోషించారు.