బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో తండ్రి, పార్టీ అధినేత కేసీఆర్ దంపతులు ఆయనను ఆశీర్వదించారు. కేటీఆర్ నిండు నూరేళ్లు, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని వారు దీవించారు. ఈ సందర్భంగా కేటీఆర్ తన కుటుంబ సభ్యులతో కలిసి మొక్కను నాటారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకులు, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ కోరిక మేరకు ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కేటీఆర్ సతీమణి శైలిమ, కుమారుడు హిమాన్షు, కూతురు రియాన్షి మరియు ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

మరోవైపు, ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద యువత చేస్తున్న ఉద్యమానికి మద్దతుగా కేటీఆర్ తన పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. యువతపై జరుగుతున్న నిర్బంధాన్ని, కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరిని నిరసిస్తూ ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఈ నేపథ్యంలో ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద బీఆర్‌ఎస్వీ ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు. నీట్ (NEET) పేపర్ లీకేజీ ఘటనకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.