వినాయక చవితి ఉత్సవాల పేరుతో పుణెలో 10 రోజుల పాటు మద్యంపై నిషేధం విధించడంపై బాంబే హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ప్రధాన న్యాయమూర్తి ఎంపీ త్రిపాఠి, న్యాయమూర్తి అద్వైత్‌ సేథ్నాలతో కూడిన ధర్మాసనం ఈ నిర్ణయంపై శుక్రవారం విచారణ చేపట్టింది.

మద్యానికి అలవాటు పడిన వ్యక్తులు ఒక్కసారిగా మద్యం మానేస్తే, అనారోగ్య సమస్యలతో దవాఖానలు కిక్కిరిసిపోయే ప్రమాదం ఉందని కోర్టు హెచ్చరించింది. కేవలం పుణెలో మాత్రమే ఇలాంటి నిషేధం విధించడం వెనుక ఉన్న కారణం ఏమిటని అధికారులను ధర్మాసనం నిలదీసింది.

కోర్టు మందలింపుతో పుణె పాలనా యంత్రాంగం దిగివచ్చింది. 10 రోజుల పాటు విధించిన మద్య నిషేధాన్ని రెండు రోజులకు కుదిస్తూ నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 14వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి 25వ తేదీ రోజంతా ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని అధికారులు ప్రకటించారు.

మద్యం తాగి ఉన్నా, లేకున్నా శాంతి భద్రతలకు ఎవరైనా విఘాతం కలిగిస్తే కఠినంగా వ్యవహరించాలని కోర్టు స్పష్టం చేసింది. చట్టాన్ని ఉల్లంఘించే వారిపై చట్టబద్ధమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే నిషేధ సమయాన్ని అధికారులు తగ్గించారు.