చర్మంపై చిన్న గుండ్రని లేదా అండాకారంలో పెరిగే పులిపిర్లను వార్ట్స్ అంటారు. ఇవి వైరల్ ఇన్‌ఫెక్షన్ వల్ల ఏర్పడతాయి. సాధారణంగా వీటి వల్ల నొప్పి ఉండదు, కానీ కొన్ని సందర్భాల్లో అసౌకర్యం కలగవచ్చు. చేతులు, కాళ్లు, జననేంద్రియాలపై కూడా ఇవి వచ్చే అవకాశం ఉంది.
ప్రారంభ దశలో ఉన్న పులిపిర్లను తగ్గించడానికి కలబంద జెల్ బాగా పనిచేస్తుంది. ఇందులో ఉండే మాలిక్ యాసిడ్ చర్మాన్ని పునరుద్ధరించడానికి సహాయపడుతుంది. అలాగే బేకింగ్ పౌడర్, ఆముదం నూనె కలిపిన మిశ్రమాన్ని రాత్రిపూట రాసి బ్యాండేజ్ వేయడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. యాపిల్ సైడర్ వెనిగర్‌లో కాటన్‌ను ముంచి వార్ట్‌లపై ఉంచడం ద్వారా అందులోని అసిటిక్ యాసిడ్ కణజాలాన్ని దెబ్బతీసి పులిపిర్లను తగ్గిస్తుంది.
అరటి తొక్క లోపలి భాగంతో ప్రతిరోజూ కొన్ని నిమిషాల పాటు రుద్దడం వల్ల అందులోని ఎంజైమ్‌లు చర్మాన్ని పునరుత్తేజపరుస్తాయి. వెల్లుల్లిని దంచి రాస్తే అందులోని అల్లిసిన్ అనే పదార్థం వైరస్‌లపై ప్రభావం చూపుతుంది. పసుపు పేస్ట్‌ను అరగంట పాటు ఉంచి కడిగేయడం, లవంగ నూనెను రాసి బ్యాండ్ ఎయిడ్‌తో కప్పడం వంటివి కూడా ఇన్‌ఫెక్షన్‌ను తగ్గించడంలో సహాయపడతాయి.
అయితే పులిపిర్ల పరిమాణం పెరగడం, నొప్పి, రక్తస్రావం వంటి లక్షణాలు కనిపిస్తే ఇంటి చిట్కాలపై ఆధారపడకూడదు. ముఖ్యంగా జననేంద్రియాలపై పులిపిర్లు ఉన్నప్పుడు వెంటనే చర్మవ్యాధి నిపుణులను సంప్రదించాలి. వైద్యులు అవసరాన్ని బట్టి శస్త్రచికిత్స లేదా క్రయోథెరపీ వంటి చికిత్సలను సూచిస్తారు.








