పుచ్చకాయ తింటే బరువు పెరుగుతామని చాలామంది భయపడతారు. కానీ, ఇందులో 92 శాతం నీరు ఉండటం వల్ల వేసవిలో శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడమే కాకుండా, తక్కువ కేలరీలతోనే కడుపు నిండిన భావన కలిగిస్తుంది. ఒక కప్పు పుచ్చకాయలో కేవలం 46 కేలరీలు మాత్రమే ఉంటాయి. ఇందులో కొవ్వు, కొలెస్ట్రాల్ అస్సలు ఉండవు కాబట్టి బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి ఎంపిక.

పుచ్చకాయలో ఉండే సిట్రులిన్ అనే అమినో ఆమ్లం శరీరంలో అర్జినైన్‌గా మారుతుంది. ఈ అర్జినైన్ కొవ్వు నిల్వలను తగ్గించి కండరాల నిర్మాణానికి సహకరిస్తుంది. అంతేకాకుండా, ఇందులో ఉండే విటమిన్లు సి, ఎ, బి5, బి6, మెగ్నిషియం, పొటాషియం శరీరానికి అవసరమైన శక్తిని అందించి వ్యాయామం చేయడానికి తోడ్పడతాయి. ఫైబర్ ఉండటం వల్ల జీర్ణక్రియ మెరుగుపడి మలబద్ధకం సమస్య కూడా తగ్గుతుంది.

పుచ్చకాయలో సహజ చక్కెరలు ఉంటాయి కాబట్టి, దీనిని పరిమితంగా తీసుకోవడం చాలా ముఖ్యం. రోజుకు రెండు కప్పుల వరకు మాత్రమే తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. అనారోగ్యకరమైన చిరుతిండ్లకు బదులుగా మధ్యాహ్న సమయంలో లేదా వ్యాయామం చేసిన తర్వాత దీనిని తీసుకోవడం వల్ల బరువు నియంత్రణలో ఉంటుంది.