మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లా షిర్‌గావ్ గ్రామానికి చెందిన 40 ఏళ్ల ప్రకాశ్ ఆనంద పాటిల్, తన ప్రియురాలు సురేఖ శివాజినే ఆరేను గొంతు నులిమి హత్య చేశాడు. సురేఖకు మరొక వ్యక్తితో సంబంధం ఉందనే అనుమానంతోనే ఆదివారం ఉదయం తన వ్యవసాయ క్షేత్రంలో ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.
హత్య అనంతరం నిందితుడు సురేఖ మృతదేహాన్ని కారులో దాచి, రాత్రంతా ప్రయాణించి థానే జిల్లాలోని భివాండికి చేరుకున్నాడు. సుమారు 350 కిలోమీటర్ల మేర మృతదేహాన్ని కారులోనే ఉంచుకుని ప్రయాణించడం గమనార్హం. సోమవారం ఉదయం భివాండిలోని కసేలీ ప్రాంతంలో నిందితుడి కదలికలపై అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే స్పందించి ప్రకాశ్ ఆనంద పాటిల్‌ను అదుపులోకి తీసుకున్నారు. కారులో ఉన్న సురేఖ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. నిందితుడిపై భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 103(1) కింద జీరో ఎఫ్‌ఐఆర్ (FIR) నమోదు చేశారు.
ప్రస్తుతం ఈ కేసును నేరం జరిగిన ప్రాంతం పరిధిలోని పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. థానేకు చేరుకున్న తర్వాత మృతదేహంతో నిందితుడు ఏం చేయాలనుకున్నాడనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.







