Priyanka | తెలంగాణ బిడ్డ.. మెడికో ప్రియాంక పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో అన్యాయంగా ఓ తాగుబోతు నిర్వాకానికి బలైతే.. అక్కడి బాబు సర్కార్‌ ‘మాకేం సంబంధం’ అన్నట్టుగా వ్యవహరించింది. ఘటనపై అక్కడి పోలీసులు మూడు రోజుల పాటు కనీసం ఎఫ్‌ఐఆర్‌ కూడా నమోదు చేయకపో వడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

హైదరాబాద్‌, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ)/అయిజ: తాగుబోతుల పైశాచికత్వానికి ఓ యువతి బలైంది. ఏపీలోని రాజమహేంద్రవరంలో ఈనెల 3న దుండగులు మద్యం మత్తులో కారుతో ఢీకొట్టిన ఘటనలో గాయపడిన మెడికో ప్రియాంక ఆదివారం మధ్యాహ్నం మృతి చెందింది. బ్రెయిన్‌డెడ్‌తో ఆమె మృతిచెందినట్టు సికింద్రాబాద్‌లోని కిమ్స్‌ వైద్యులు ధ్రువీకరించారు. వివరాల్లోకి వెళ్తే.. జోగుళాంబ గద్వాల జిల్లా అయిజ మండలం ఎక్లాస్‌పురం గ్రామానికి చెందిన చంద్రకళ, వెంకటేశ్‌ దంపతుల మొదటి కుమార్తె ప్రియాంక కర్నూల్‌లో ఎంబీబీఎస్‌ పూర్తి చేసి, రాజమహేంద్రవరంలోని జీఎస్‌ఎల్‌ వైద్య కళాశాలలో పీజీ డెర్మటాలజీ చదువుతున్నది. చెల్లెళ్లు బిందు, పరిమళ బీటెక్‌ పూర్తి చేసుకొని ఉద్యోగంలో స్థిరపడ్డారు.

రాజమహేంద్రవరంలో ఈనెల 3న స్నేహితుడితో కలిసి సినిమాకు వెళ్లి హాల్‌ నుంచి బైక్‌పై బయటకు బయటకు వస్తున్న ప్రియాంక (28)ను మద్యంమత్తులో ఉన్న దుష్యంత్‌, ఆండ్రూ విలియం జోసెఫ్‌ కారుతో వేగంగా ఢీకొట్టారు. స్నేహితుడు ఉమేశ్‌ స్వల్ప గాయాలతో బయటపడగా, ప్రియాంక పరిస్థితి విషమంగా మారింది. దీంతో రాజమండ్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ దవాఖానకు తరలించారు. అప్నియా టెస్ట్‌ చేయాలని వైద్యులు ప్రయత్నించినా, ఆమె శరీరం సహకరించలేదు. 6 రోజుల పాటు మృత్యువుతో పోరాడిన ప్రియాంక చివరకు బ్రెయిన్‌డెడ్‌తో మృతిచెందినట్టు వైద్యులు ప్రకటించారు.

ప్రియాంకను కారుతో ఢీకొట్టిన ఘటనలో పోలీసుల విచారణలో కీలక విషయాలను తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిశోర్‌ వెల్లడించారు. ఇది కేవలం ప్రమాదం కాదని, నిందితుల అత్యంత క్రూరమైన చర్యగా పేర్కొన్నారు. మద్యంమత్తులో మాల్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా అడ్డుకున సెక్యూరిటీ సిబ్బందిపై దాడి చేసినట్టు తెలిపారు. పారిపోయే క్రమంలో స్కూటీపై వెళ్తున్న వైద్య విద్యార్థులను ఆ నిందితులు కారుతో ఏకంగా మూడు సార్లు బలంగా ఢీకొట్టినట్టు వెల్లడించారు. ప్రమాదం జరిగిన వెంటనే నిందితులు పారిపోయినట్టు ఎస్పీ వివరించారు. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన అనంతరం నిందితులను అరెస్టు చేశామని పేర్కొన్నారు. బీఎన్‌ఎస్‌ 110 సెక్షన్‌ హత్యాయత్నం కేసు నమోదు చేశామని తెలిపారు.

ప్రమాదం జరిగి 6 రోజులు కావస్తున్నా నిందితులను నామమాత్రపు కేసు పెట్టి జైలుకు పంపడంపై మెడికో కుటుంబ సభ్యులు ఏపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. మూడు రోజుల పాటు కనీసం ఎఫ్‌ఐఆర్‌ కూడా పోలీసులు నమోదు చేయకపోవడంపై మండిపడ్డారు. నిందితులపై హత్య కేసు నమోదు చేయాలని ఆదివారం రాజమండ్రికి వెళ్లి పోలీసులను కోరినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌, మంత్రి లోకేశ్‌, హోం మంత్రి అనిత స్పందించకపోవడం దారుణమని మండిపడ్డారు.

కనీసం చికిత్స జరుగుతున్న తీరును కూడా అడిగి తెలుసుకోలేదని ఆవేదన వ్యక్తంచేశారు. నిందితులపై హత్య కేసు నమోదు చేసి ఉరిశిక్ష వేయించాలని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు డిమాండ్‌ చేస్తున్నారు. మరోవైపు ప్రియాంక మృతి, ఏపీ ప్రభుత్వంపై వచ్చిన విమర్శల నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు, హోం మంత్రి అనిత ఆదివారం స్పందించారు. ప్రియాంక మృతి బాధాకరమని, దోషులను కఠినంగా శిక్షిస్తామని ప్రకటించారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని స్పష్టంచేశారు.

దవాఖానలో చికిత్స పొందుతూ తిరిగి వస్తుందనుకున్న ప్రియాంక ఇక ఎప్పటికీ తిరిగిరాదని తెలిసి తల్లిదండ్రులు వెంకటేశ్‌, చంద్రకళ రోదనలు మిన్నంటాయి. ఎక్లాస్‌పురం గ్రామం శోక సంద్రంలో మునిగిపోయింది. ప్రియాంక అంత్యక్రియలు సోమవారం మధ్యాహ్నం నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రియాంక మృతదేహాన్ని ప్రైవేట్‌ దవాఖాన నుంచి గాంధీ దవాఖానకు తరలించారు. ఏపీ నుంచి రాజమండ్రి పోలీసులు, తండ్రి వెంకటేశ్‌ వచ్చాక ఆమె మృతదేహానికి పంచనామా నిర్వహించనున్నారు.