ప్రస్తుత యువత డేటింగ్, షాపింగ్ లేదా ఇతర సామాజిక సంబంధాల కంటే తమను తాము ప్రేమించుకోవడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎవరితోనూ రొమాంటిక్ సంబంధాలు పెట్టుకోకుండా, ఉద్దేశపూర్వకంగా ఒంటరిగా ఉంటూ కెరీర్ మరియు ఆరోగ్యంపై శ్రద్ధ చూపడాన్ని సోలో మాక్సింగ్‌గా నిపుణులు వివరిస్తున్నారు. ఈ ట్రెండ్‌లో భాగంగా యువత కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడం, ఒంటరిగా ప్రయాణాలు చేయడం వంటి స్వీయాభివృద్ధి పనులకు ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు.

డేటింగ్‌కు అయ్యే భారీ ఖర్చులు కూడా యువతను ఈ నిర్ణయం వైపు నడిపిస్తున్నాయి. బ్యాంక్ ఆఫ్ మాంట్రియల్ 2026 రియల్ ఫైనాన్షియల్ ప్రోగ్రెస్ ఇండెక్స్ ప్రకారం, అమెరికాలో డేటింగ్ కోసం ఏడాదికి సగటున 2323 డాలర్లు ఖర్చవుతోంది. భారత్‌లోని ముంబై వంటి నగరాల్లో కూడా ఒక సాధారణ డేట్ కోసం ప్రయాణం, ఆహారం, సినిమా కలిపి ఐదు నుంచి ఆరు వేల రూపాయల వరకు ఖర్చవుతుందని గణాంకాలు చెబుతున్నాయి.

పెరుగుతున్న ద్రవ్యోల్బణం (వస్తువుల ధరల పెరుగుదల), ఉద్యోగాల్లో అస్థిరత, జీతాలు పెరగకపోవడం వంటి ఆర్థిక కారణాలు కూడా యువతను సంబంధాలకు దూరంగా ఉంచుతున్నాయి. డేటింగ్ యాప్‌ల వల్ల మానసిక ప్రశాంతత లభించడం లేదని భావిస్తున్న జెన్ జీలు, పెళ్లిళ్లు లేదా సంబంధాల వల్ల వచ్చే ఇబ్బందులను చూసి కూడా ఈ నిర్ణయానికి వస్తున్నారు.

కొంతమంది ఈ ధోరణిని స్వార్థంగా చూస్తున్నప్పటికీ, మానసిక నిపుణులు మాత్రం దీనిని స్వీయ క్రమశిక్షణకు పునాదిగా అభివర్ణిస్తున్నారు. సరైన వ్యక్తి కోసం ఎదురుచూస్తూ జీవితాన్ని ఆపేయడం కంటే, ముందుగా తమ జీవితాన్ని అందంగా నిర్మించుకోవడమే ఉత్తమమని యువత భావిస్తున్నారు.