ప్రకాశం జిల్లా అద్దంకి మండలం శంఖవరప్పాడు వద్ద ఇద్దరు ఎస్సైలు ప్రయాణిస్తున్న కారు ఒక ఆటోను ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన తర్వాత ఆ కారును పరిశీలించగా, అందులో గంజాయి, మద్యం బాటిళ్లు, పోలీస్ యూనిఫాం లభ్యమయ్యాయని వైఎస్‌ జగన్‌ తెలిపారు. ఈ ఘటనలో ఆటోలో ఉన్నవారు తీవ్రంగా గాయపడ్డారని ఆయన పేర్కొన్నారు.

ప్రమాద స్థలంలో ఉన్న ఇద్దరు ఎస్సైలు మద్యం మత్తులో ఉన్నారని, అక్కడికి చేరుకున్న మరో సీఐ వీడియోలు తీస్తున్న ప్రజలను బెదిరించారని జగన్ ఆరోపించారు. ఈ ఘటనపై స్థానిక టీడీపీ నాయకులు పోలీసులను తప్పించారని, ఆ పార్టీ నేతలు పాల్గొన్న ప్రైవేటు పార్టీలో గంజాయి, మద్యం వాడారని వస్తున్న ఆరోపణలు తీవ్రంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.

రాజకీయ ప్రత్యర్థులపై కేసులు పెట్టడంపై చూపే శ్రద్ధలో కొంతైనా శాంతిభద్రతల మెరుగుదలపై పెట్టాలని జగన్ సీఎం చంద్రబాబును కోరారు. వ్యవస్థలను రాజకీయ ప్రయోజనాలకు, కలెక్షన్లకు వాడుకోవడం వల్లే అవి భ్రష్టుపట్టాయని ఆయన విమర్శించారు.

ఈ ఘటనను మీడియా ద్వారా కప్పిపుచ్చకుండా, నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని జగన్ డిమాండ్ చేశారు. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.