సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న పోలీస్ యాక్షన్ సినిమా 'స్పిరిట్' షూటింగ్ ఇప్పటికే 40 శాతం పూర్తయింది. ఈ చిత్రంలో తృప్తి దిమ్రి హీరోయిన్‌గా నటిస్తుండగా, ఐశ్వర్య దేశాయ్ ఒక కీలక పాత్రలో కనిపిస్తారు. వీరితో పాటు కథలో మరో ముఖ్యమైన గెస్ట్ రోల్ కోసం చిత్రబృందం ఒక స్టార్ హీరోయిన్ కోసం చూస్తోంది.
ఈ గెస్ట్ రోల్ కోసం దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ఇద్దరు హీరోయిన్ల పేర్లను పరిశీలిస్తున్నారు. అందులో బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ ఒకరు. కత్రినా గతంలో తెలుగులో కూడా సినిమాలు చేశారు. అయితే, విక్కీ కౌశల్‌ను వివాహం చేసుకున్న తర్వాత, గతేడాది బాబుకు జన్మనిచ్చిన కత్రినా ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్నారు. 2024లో విడుదలైన 'మెర్రీ క్రిస్టమస్' ఆమె చివరి సినిమా.
ఈ పాత్ర కోసం కేవలం రెండు రోజుల కాల్షీట్స్ మాత్రమే అవసరమవుతాయని సమాచారం. కత్రినా ఈ సినిమాలో నటిస్తే బాలీవుడ్‌లో సినిమాకు మరింత హైప్ రావడం ఖాయమని చిత్ర వర్గాలు భావిస్తున్నాయి. ఒకవేళ కత్రినా ఈ ఆఫర్‌ను తిరస్కరిస్తే, మరో హీరోయిన్‌ను ఎంపిక చేసే అవకాశం ఉంది. కత్రినా ఈ పాత్రకు ఒప్పుకుంటారా లేదా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.







