పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ (TD) పథకంలో ఐదేళ్ల పాటు డబ్బును ఉంచితే సంవత్సరానికి 7.50 శాతం వడ్డీని ప్రభుత్వం అందిస్తోంది. దీన్నే సాధారణంగా పోస్ట్ ఆఫీస్ FD అని పిలుస్తారు. ఇందులో ఒకేసారి డబ్బును జమ చేసి, నిర్ణీత కాలపరిమితి పూర్తయ్యే వరకు పెట్టుబడిని కొనసాగించవచ్చు.
ఈ పథకంలో పెట్టుబడి పెట్టడానికి పెద్ద మొత్తంలో డబ్బు అవసరం లేదు. కేవలం రూ. 1,000తో ఖాతాను ప్రారంభించవచ్చు. ఆ తర్వాత మీ ఆర్థిక సామర్థ్యాన్ని బట్టి మరిన్ని డబ్బులను జమ చేసే అవకాశం ఉంది. నగదు లేదా చెక్ ద్వారా పెట్టుబడి పెట్టవచ్చు, అలాగే నామినేషన్ సదుపాయం కూడా అందుబాటులో ఉంది.
ఈ పథకంలో సీనియర్ సిటిజన్లకు ప్రత్యేకంగా అదనపు వడ్డీ ఏమీ ఉండదు. సాధారణ పెట్టుబడిదారులకు వర్తించే 7.50 శాతం వడ్డీ రేటే 60 ఏళ్లు పైబడిన వారికి కూడా వర్తిస్తుంది. డిపాజిట్‌పై వచ్చే వడ్డీని ప్రతి ఏడాది చెల్లిస్తారు.
ఐదేళ్ల టైమ్ డిపాజిట్ పథకంలో పెట్టుబడి పెట్టడం వల్ల ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద పన్ను ప్రయోజనాలు పొందవచ్చు. అయితే, పన్ను ఆదా అనేది మీ వ్యక్తిగత పన్ను పరిస్థితి, వర్తించే నిబంధనలు, పరిమితులపై ఆధారపడి ఉంటుంది.
బ్యాంకుల్లో ఉండే ఫిక్స్‌డ్ డిపాజిట్లతో (FD) పోలిస్తే, పోస్టాఫీస్ పథకాల వడ్డీ రేట్ల విధానం భిన్నంగా ఉంటుంది. వీటిని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నిర్ణయిస్తుంది. సాధారణంగా ప్రతి మూడు నెలలకు ఒకసారి ఈ వడ్డీ రేట్లను ప్రభుత్వం సమీక్షిస్తుంది.
ఈ వడ్డీ రేట్లు నేరుగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రెపో రేటుతో ముడిపడి ఉండవు. అవసరాన్ని బట్టి ప్రభుత్వం వడ్డీల్లో మార్పులు చేస్తుంది. కాబట్టి, పెట్టుబడి పెట్టే ముందు ప్రస్తుత వడ్డీ రేట్లు, మెచ్యూరిటీ నిబంధనలను ఒకసారి పరిశీలించుకోవడం మంచిది.







