20 వేల పోలీస్ ఉద్యోగాలను భర్తీ చేస్తారని ఆశపడిన నిరుద్యోగులకు, ప్రభుత్వం కేవలం 7 వేల పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేయడంతో తీవ్ర నిరాశ ఎదురైంది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రేవంత్ ప్రభుత్వం తమను మోసం చేస్తోందని ఆరోపిస్తూ నిరుద్యోగులు గురువారం చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ వద్ద ఆందోళన చేపట్టారు.

ఈ నిరసనలో పాల్గొన్న వారు 'మేధావుల్లారా మీరెక్కడ?', 'నిరుద్యోగుల కన్నీళ్లు కనిపించడం లేదా?' అంటూ నినాదాలు చేశారు. 20 వేల పోలీస్ ఉద్యోగాలను భర్తీ చేయాలని, అలాగే 46, 29 జీఓలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులను ప్రదర్శించారు. ఈ సందర్భంగా నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

మరోవైపు, తెలంగాణ నిరుద్యోగుల జేఏసీ (JAC) ఈ అంశంపై పోరాటాన్ని ఉధృతం చేస్తోంది. ఈనెల 5న ఉదయం 10 గంటలకు 'హలో నిరుద్యోగి చలో అశోక్‌నగర్' కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జేఏసీ నేతలు ప్రకటించారు. అశోక్‌నగర్ నుంచి ధర్నాచౌక్ వరకు ర్యాలీ నిర్వహించనున్నట్లు వారు వెల్లడించారు.