ఒక బంధువుల వివాహ వేడుకలో తన కజిన్ చేతికి ఉన్న ఖరీదైన రోలెక్స్ వాచ్ చూసి, ప్రథమ్ అనే వ్యక్తి ఆశ్చర్యపోయాడు. ప్లాస్టిక్ వ్యాపారం చేస్తున్నానని ఆ కజిన్ చెప్పడంతో, సాధారణ వ్యాపారమే అనుకున్న ప్రథమ్, అంత భారీ ఆదాయం ఎలా వస్తుందని ఆరా తీశాడు. దీంతో ఆ కజిన్ తన వ్యాపార రహస్యాన్ని వివరించాడు.
అతడు చేస్తున్నది కేవలం ప్లాస్టిక్ వ్యర్థాలను అమ్మే పని కాదు. ఫ్యాక్టరీల నుంచి వచ్చే ప్లాస్టిక్ సీసాలు, డబ్బాలు, ఇతర స్క్రాప్‌ను కిలోకు సుమారు రూ. 13 చొప్పున కొనుగోలు చేస్తాడు. ఆ వ్యర్థాలను రీసైకిల్ చేసి, ప్లాస్టిక్ గ్రాన్యూల్స్ (చిన్న చిన్న ప్లాస్టిక్ ముక్కలు)గా మారుస్తాడు.
ఈ ప్లాస్టిక్ గ్రాన్యూల్స్‌ను కిలోకు రూ. 80 నుంచి రూ. 90 వరకు విక్రయిస్తున్నట్లు అతడు తెలిపాడు. ప్లాస్టిక్ రకాలను బట్టి వాటి లక్షణాలు మారుతుంటాయి కాబట్టి, వ్యర్థాలను వేరు చేయడం ఈ ప్రక్రియలో చాలా ముఖ్యమని అతడు వివరించాడు. ఇలా నెలకు 50 టన్నుల వ్యర్థాలను రీసైకిల్ చేయడం ద్వారా రూ. 40 లక్షల వరకు అమ్మకాలు జరుగుతున్నాయి.
ఈ రీసైకిల్ చేసిన ప్లాస్టిక్‌ను కార్లు, ఆటో విడిభాగాలు, ప్యాకేజింగ్, దుస్తుల ఫైబర్లు, పైపులు మరియు గృహోపకరణాల తయారీలో ఉపయోగిస్తారు. వ్యర్థాల నుంచి సంపదను సృష్టించే ఈ వ్యాపార నమూనాపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్లాస్టిక్‌ను ముడిసరుకుగా మార్చడంలోనే అసలైన లాభం ఉందని వారు అభిప్రాయపడుతున్నారు.







