ప్రస్తుతం గృహోపకరణాలు, దుస్తులు, ఎలక్ట్రానిక్స్ వంటి ఉత్పత్తులను డెలివరీ చేస్తున్న ఫ్లిప్‌కార్ట్, రాబోయే కొద్ది వారాల్లో ఫుడ్ డెలివరీ రంగంలోకి అడుగుపెట్టనుంది. ఈ విషయాన్ని ఫ్లిప్‌కార్ట్ సీఈఓ కళ్యాణ్ కృష్ణమూర్తి ఒక మీడియా ఇంటర్వ్యూలో వెల్లడించారు.
భారతదేశంలో ఇప్పటికే స్విగ్గీ, జొమాటో వంటి సంస్థలు ఫుడ్ డెలివరీ సేవలను అందిస్తున్నాయి. వీటితో పోటీ పడేందుకు ఫ్లిప్‌కార్ట్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ సేవలను ప్రత్యేక యాప్ ద్వారా లేదా ప్రస్తుతం ఉన్న ఫ్లిప్‌కార్ట్ యాప్ ద్వారా వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆయన తెలిపారు.
ఈ కొత్త సేవను ముందుగా పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభించనున్నారు. ఈ ప్రాజెక్ట్ విజయవంతమైతే, దేశవ్యాప్తంగా అన్ని నగరాలకు ఫుడ్ డెలివరీ సేవలను విస్తరించాలని కంపెనీ యోచిస్తోంది. అయితే, ఈ సేవకు సంబంధించిన యాప్ వివరాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.








